Gummanuri Jayaram Birthruff: ఏపీ మంత్రి గుమ్మనూరి జయరాం బర్తరఫ్ కు గురయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన కారణంగా మంత్రి గుమ్మనూరిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ సీపీకి గత కొంత కాలంగా దూరం అవుతూ వచ్చారు. త్వరలో సొంత గూడు తెలుగుదేశం పార్టీలో చేరుతానే వార్తలు నేడు నిజం అయ్యాయి.
వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో బాగంగా ఆలూరు నియోజకవర్గం పార్టీ ఇంచార్జిగా విరుపాక్షిని నియమించింది. మంత్రిగా ఉన్న జయరాంను కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తన ప్రత్యర్థికి టికెట్ ఇవ్వొద్దని చెబుతూనే వచ్చారు. అంతేగాక పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు గుమ్మనూరు ఆసక్తి చూపలేదు. మళ్ళీ ఆలూరు టికెట్ తనకే ఇవ్వాలని పట్టు పట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రాలేదు. గుమ్మనూరు మాత్రం ఆలూరు టికెట్ కోసం పట్టు విడలేదు. దీనికి తోడు చివరి క్యాబినెట్ మీటింగ్ కు వెళ్ళి తన మనసులో మాట జగన్ కు చెప్పినా ఆయన వినిపించుకోలేదు. దీంతో గుమ్మనూరు జయరాం పార్టీని వీడాలని నిర్ణయించుకుని టీడీపీలో చేరారు.