Nominated posts to BJP leaders : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిపోతోంది. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన మూడు పార్టీల నేతలు ఇప్పుడు నామినెటెడ్ పోస్టుల కోసం చూస్తున్నారు. ఈ సారి తెలుగుదేసం పార్టీ , జనసేన బీజేపీ నేతలకూ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందకే ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం జరిగినందున ఈ సారి బీజేపీ సీనియర్ నేతలకు పెద్ద పీట వేయాల్సి ఉందన్న అభిప్రాయం ఉంది.
బీజేపీలో సీనియర్ నేతలకు కీలక పదవులు ?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సుదీర్గంగా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉండే అవకాశం ఎప్పుడూ రాలేదు. మధ్యలో టీడీపీ తో కలిసి నాలుగు ఏళ్లు ప్రభుత్వంలో కూటమిలో భాగంగా ఉన్నారు. అప్పుడు పెద్దగా నామినేటెడ్ పోస్టులు దగ్గలేదు. ఒక్క సోము వీర్రాజకు మాత్రం ఎమ్మెల్సీ పదవి లభించింది. ఈ సారి సోము వీర్రాజుకు రాజ్యసభ స్థానంతో పాటు ఇతర సీనియర్లు ఎమ్మెల్సీలు, కేబినెట్ హోదా ఉన్న ఇతర నామినేటెడ్ పోస్టులు కోరుకుంటున్నారు. టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకు పెద్దగా చాన్సులు లభించలేదు. వివిధ కారణాల వల్ల వారు త్యాగం చేశారు. వారికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చురుకుగా ప్రచారం చేసిన బీజేపీ నేతలు
మొత్తంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేసింది. తమకు అవకాశం దక్కపోయినా పలువురు సీనియర్లు ఉత్సాహంగా పని చేశారు. ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి తోపాటు ఇతర నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ స్థానం కోసం గట్టిగా ప్రయత్నించారు. కానీ ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించడంతో సాధ్యం కాలేదు. అయినప్పటికీ పార్టీ విజయం కోసం శ్రమించారు. ఆయనలా కష్టపడిన వారికి కేబినెట్ ర్యాంక్ పదవులు ఇవ్వాలన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. గట్టిగా పార్టీ కోసం కష్టపడిన నేతలను లెక్కిస్తే అందులో మొదిట పేర్లు యువనేతలవే ఉంటాయని భావిస్తున్నారు.
టీటీడీ బోర్డు సహా అనేక కీలక పదవులు
ఏపీ ప్రభుత్వం భర్తీ చేయాల్సిన పోస్టుల్లో చాలా కీలక పదవులు ఉన్నాయి. టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యుల పదవులతో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ , సభ్యుల పోస్టులు ఉన్నాయి. ఇందులో కేబినెట్ ర్యాంక్ పోస్టులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మంత్రుల స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే పదవుల కోసం డిమాండ్ ఉంటుంది. మరి బీజేపీ నేతలకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో ?