Crop Damage Compensation: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022 ఖరీఫ్ సీజన్ లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించబోతోంది. అది కూడా ఆ సీజన్ ముగియక ముందే ఇవ్వడం హర్షణీయం. అయితే ఈనెల 28వ తేదీన నేరుగా రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతోపాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన అకాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 45 వేల 998 మంది రైతులకు చెందిన 60 వేల 832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లుగా గుర్తించింది. ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతులు 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్వాన పంటలు దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలోనే వీరందరికీ పంట నష్ట పరిహారం జమ చేయాలని నిర్ణయించారు.


రైతుల జాబితాలను జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ప్రదర్శన..


అత్యధికంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. వ్యవసాయ పంటల్లో 11,742 ఎకరాల్లో వరి, 5,205, ఎకరాల్లో పత్తి 4,887 ఎకరాల్లో 3,915 ఎకరాల్లో పెసర.. ఉద్యాన పంటల్లో 7 వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు 18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44 కోట్లు చొప్పున మొత్తంగా రూ39.39 కోట్లు పంట నష్ట పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు రైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. 


గత మూడేళ్లలో రూ.1,795.4 కోట్లు అందించిన ప్రభుత్వం..


వరదలు, అకాల వర్షాలు వంటి వివిధ వైపరీత్యాల వల్ల 2019-20 సీజన్ లో 1.47 లక్షల మందికి రూ.116.63 కోట్లు, 2020-21 సీజన్ లో 12.15 లక్షల మందికి రూ.932.07 కోట్లు, 2021-22 సీజన్ లో 6.32 లక్షల మందికి రూ.564 కోట్ల చొప్పున గత మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.4 కోట్ల పంట నష్ట పరిహారాన్ని అందించారు. ప్రస్తుతం 2022-23లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 45,998 మంది రైతులకు ఈనెల 28వ తేదీన రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020-21 రబీ సీజన్ కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు చొప్పున మొత్తంగా 8.22లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు. పంట నష్ట పరిహారం, సున్నా వడ్డీ కలిసి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.