Heavy Rains In AP: ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకూ ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అటు, శనివారం సాయంత్రం నాటికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 64 మి.మీ, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో 54.7 మి.మీ, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 47.7 మి.మీ, ఏలూరు జిల్లా చాట్రాయిలో 39.5 మి.మీ, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 38.5 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
ప్రభుత్వం అలర్ట్
భారీ వర్షాల సూచన క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. పోలీస్, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. బలహీనంగా ఉన్న చెరువులు, కాలువ గట్లను పటిష్టం చేయాలని సంబంధిత అధికారులకు నిర్దేశించారు. ఏలూరు, ప్రకాశం, ప.గో, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు సైతం ముందస్తు చర్యలు చేపట్టాలని.. వాగులు పొంగే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల శాఖ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800 425 0101 ను సంప్రదించాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది. భారీ వర్షం పడే సమయంలో ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండకూడదని.. సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని తెలిపింది.
Also Read: Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు