Teachers Transfers: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి మార్గదర్శకాలను సోమవారం విడుదల చేశారు. గత వారంలో ఏపీ రాష్ట్ర సర్కారు బదిలీలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయ బదిలీల విషయమై జగన్ సర్కారు వేర్వేరుగా మార్గదర్శకాలను విడుదల చేసింది. 8 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


ఐదేళ్లుగా ఒకే దగ్గర హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న వారు కూడా తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే అని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కొత్త జిల్లాలు యూనిట్ గా టీచర్ల బదిలీలను నిర్వహించనుంది. ఈ నెల 31లోపు ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులతోనే రాష్ట్ర సర్కారు బదిలీలు చేపట్టనుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల కోసం జీవో నంబర్ 47 ను విడుదల చేసింది. 5 రోజుల క్రితం ఉపాధ్యాయుల సంఘాలతో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం అయ్యారు. టీచర్ల బదిలీలపై ఈ భేటీలో చర్చించారు. గతంలో కూడా ఇదే విషయమై ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించారు. 


ఈ నెల 22 నుండి 31 వరకు బదిలీలకు అవకాశం


ఈ నెల 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్ల బదిలీలకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పించింది. అయితే జూన్ 1 నుండి మళ్లీ నిషేధం వర్తిస్తుంది. రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో బదిలీలకు అవకాశం కల్పిస్తూ.. ఈ మేరకు ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి అయిన వారికి బదిలీ తప్పనిసరిగా ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే 2023 ఏప్రిల్ 30 నాటికి ఒకే చోట్ రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి రిక్వెస్ట్ పై బదిలీకి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికనే బదిలీలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బదిలీల్లో భార్యాభర్తలకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులు అవుతారని సర్కారు తేల్చి చెప్పింది. బదిలీలు అన్నింటినీ ఉద్యోగుల అభ్యర్థనగానే పరిగణిస్తారు. ప్రమోషన్ పై ఉద్యోగి బదిలీ తప్పకపోతే బదిలీ చేసే చోట ఆ పోస్టు ఉండాలి. అంతే కాదు ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు జరిగే బాధ్యతను సంబంధిత శాఖల అధిపతులకు ఉంటుదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.


ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశం


కొన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీలను ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను బదిలీ చేయవద్దని కూడా సర్కారు పేర్కొంది. అలాగే దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు ఈ బదిలీల నుండి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వారు స్వచ్ఛందంగా బదిలీ కావాలని కోరుకుంటే వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయవచ్చు. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బదిలీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే ఆయా ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.