AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక అడుగు వేసింది. ఉద్యోగుల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులు, ఉద్యోగులు విభజనకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా, డివిజనల్‌ ఉద్యోగుల విభజన చేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. జిల్లా, డివిజనల్‌ ఉన్నతాధికారుల పోస్టులు మినహా కొత్త పోస్టులు సృష్టించవద్దని పేర్కొంది. ఉద్యోగుల విభజన తాత్కాలికమేనని, తుది కేటాయింపులు మళ్లీ చేపడతామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆర్డర్‌ టు సర్వ్‌(Order to serve) కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నెల 28 నుంచి మార్చి 11 వరకు ఉద్యోగుల కేటాయింపు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఫైనల్‌ గెజిట్‌ తర్వాత ఉద్యోగులకు ఆర్డర్‌ టు సర్వ్‌  ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. 


ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలు 


జిల్లాల పునర్ వ్వవస్థీకరణలో ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త జిల్లాల్లో కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్‌ ఫామ్‌లు అందిస్తున్నారు. సీఎస్‌(CS) నేతృత్వంలోని కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లలలో పనిచేయడం ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 2 జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి అపాయింటెడ్‌ డే(Appointed Day)గా ప్రభుత్వం పేర్కొంది. 


శాశ్వత విభజనకు కొంత సమయం 


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనరులు, ఉద్యోగుల శాశ్వత విభజనకు మరికొంత సమయం పడుతోందని ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ప్రభుత్వ విధులు యథావిథిగా జరిగేందుకు తాత్కాలికంగా ఉద్యోగులు, పోస్టులు, వనరుల కేటాయింపు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాత్కాలిక కేటాయింపుల కోసం రాష్ట్ర, ప్రాంతీయ, జోనల్‌, మండల, గ్రామ స్థాయిలోని కార్యాలయాలు, పోస్టుల విభజన, కేటాయింపు లేదని పేర్కొంది. జిల్లా, డివిజన్‌ స్థాయిలోని ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని ఆర్థికశాఖ పర్యవేక్షిస్తుంది. కొత్త జిల్లాలకు ఆర్డర్‌ టు సర్వ్‌ తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. 


పోలీసు విభాగం మినహా 


కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా తాత్కాలిక ప్రాతిపదికనే కొత్త జిల్లాలకు  కేటాయిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ పోలీసు(AP Police) విభాగం మినహా మిగతా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కొత్త జిల్లాలు, డివిజన్ లకు అనుగుణంగా మార్పులు ఉంటాయని పేర్కొంది. మార్చి 11వ తేదీ నాటికి ఉద్యోగుల కేటాయింపుల జాబితా సిద్ధమవుతుందని ప్రభుత్వం తెలిపింది. తుది జాబితాకు అనుగుణంగా ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొంది.