Amaravati farmers problems : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అలాంటి సమయంలో అమరావతి రైతులు తమ భూముల్ని ఇచ్చారు. రాజదానికి త్యాగం చేయడంతో పాటు రాజధానితో పాటు తాము కూడా ఎదుగుతామని అనుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా వారికి సమస్యలే ఎదురు వస్తున్నాయి. ఇటీవల సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అమరావతి రైతులను మరిచేదే లేదు. ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, శ్రవణ్ కుమార్‌లకు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. వీరు ముగ్గురూ రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కానీ రైతుల్లో ఆందోళన తగ్గడం లేదు.
అమరావతి రైతుల్లో ఇంకా అనేక సందేహాలు
అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA)లో అవినీతి, కౌలు చెల్లింపుల ఆలస్యం, రిటర్నబుల్ ప్లాట్లను ఇప్పటికీ ఇవ్వకపోవడం,కేటాయించిన ప్లాట్ల విషయంలోనూ ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడం రైతులను కలవరపరుస్తున్నాయి. అమరావతి భూమి పూలింగ్ స్కీమ్ కింద 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు, 15 నెలలు గడిచినా అనుకున్న విధంగా ప్రయోజనం కలలేదన్న ఆందోళనలో ఉన్నారు. కౌలు చెల్లింపులు ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతులకు రకరకాల సమస్యలు
CRDAలో అవినీతి ఆరోపణలు కూడా రైతుల అసంతృప్తిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) పాలసీలు అర్బిట్రరీగా ఉండటంతో, భూమి ఉపయోగం, అభివృద్ధి తగ్గిపోతోందని అనుకుంటున్నారు. రభుత్వం మొత్తం అమరావతి విజన్‌ను పునరుద్ధరించాలని, రైతులతో నెలవారీ సమీక్ష మీటింగ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసతున్నారు. ఈ అసంతృప్తి కారణంగా JAC, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రితో సమావేశం జరపమని, సమస్యలకు క్లియర్ టైమ్‌లైన్‌లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి మళ్లీ మొదలయినా, రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాజకీయంగా ప్రభుత్వానికి సవాలుగా మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమస్యలపైనా ప్రభుత్వం అంత ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం రైతుల్ని ఆగ్రహానికి గురి చేస్తోంది.సగానికి సగం మంది రైతులకూ ఏదో ఓ సమస్య ఉంటోంది. కానీ పరిష్కారం మాత్రం కనిపించడం లేదు.
సీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యమే అసలు సమస్య ! రాజధాని విస్తరణకు అవసరమైన భూముల విషయంలో సీఆర్డీఏ అధికారుల వైఖరి పైనే ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. 2014లో రాజధాని కోసం భూములు సేకరిస్తున్న సమయంలో అధికారులు రైతులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. వారు ప్రభుత్వ నిర్ణయాలను రైతులకు వివరించి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారు. కానీ ఇప్పుడు అదే సిఆర్డిఏలో అవగాహన, బాధ్యత గణనీయంగా తగ్గిపోయిందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల నమ్మకాన్ని తిరిగి పొందాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో అమరావతి అభివృద్ధి ప్రణాళికలు ఆలస్యమవుతాయి. రాజధాని నిర్మాణం రైతుల సహకారం లేకుండా సాధ్యం కాదు. అందుకే రైతుల నమ్మకాన్ని మళ్లీ పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
సీఎం చంద్రబాబు నేరుగా పట్టించుకోవాల్సిందే !
సీఎం చంద్రబాబు రైతుల విషయంలో పాజిటివ్ గా ఉంటున్నారు. అందరం కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకుందాం.. సీఆర్డీఏ భవనం ప్రారంభం మన అభివృద్ధి యాత్రకు ఆరంభం అన్నారు. రాజధాని అమరావతి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది... దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి మట్టి, జలాలు తెచ్చి శంకుస్థాపన చేశామని.. అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటాం... హ్యండ్ హోల్డింగ్ ఇస్తామని భరోసా ఇస్తున్నారు. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించరన్నట్లుగా అమరావతి రైతుల పరిస్థితి ఉంది. దీన్ని కూడా సీఎం గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోందని అంటున్నారు.