AP Government Hiked Marriage Registration Fees: ఏపీలో కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారికి ప్రభుత్వం షాకిచ్చింది. వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో నెల రోజుల్లో శుభ ముహూర్తాలు మొదలు కానున్నాయి. భారీగా వివాహాలు జరగనున్న నేపథ్యంలో సర్కారు పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ ఫీజులను (Marriage Registration Fees) సవరిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 ఉండగా, దానిని రూ.500కు పెంచింది. దంపతుల అభ్యర్థనతో కార్యాలయం బయట జరిగే వివాహ వేదిక వద్దకు సబ్ రిజిస్ట్రార్ వస్తే ఆ ఫీజును ఏకంగా రూ.5 వేలకు పెంచింది. ఇప్పటి వరకూ ఈ ఫీజు రూ.210గా ఉండేది. ప్రస్తుత ఏడాదిలో వివాహాల రికార్డుల పరిశీలనకు రూపాయిగా ఉన్న ఫీజును రూ.100కు పెంచింది. సెలవు రోజుల్లో వివాహాల నమోదుకు ఫీజును రూ.5 వేలుగా చేసింది. ఇందు కోసం 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీ చేసిన ఫీజులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


రిజిస్ట్రేషన్ సులభతరం


కాగా, ఫీజులు పెంచినప్పటికీ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ విధానంపై సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్లు మరింత సులభతరం అయ్యేలా ఆన్ లైన్ లోనే నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఇది అమలు చేస్తుండగా.. త్వరలో పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటివరకూ హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాన్యువల్ గా రిజిస్టర్ చేసేవారు. ఇందు కోసం వరుడు, వధువు ఆధార్ కార్డులు, పెళ్లి ఫోటోలు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫామ్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్ కు అందజేస్తున్నారు. ఆయన ఆ వివరాలను సరి చూసి పుస్తకంలో నమోదు చేస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే జరగనుంది. www.registrations.ap.gov.in సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.


ప్రాసెస్ ఇలా



  • వెబ్ సైట్ లో లాగిన్ అయిన వెంటనే హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లేదా ఈ - మెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ కావచ్చు.

  • లాగిన్ అయిన అనంతరం ఆన్ లైన్ ఫామ్ పూర్తి చేసి వరుడు, వధువు ఆధార్ కార్డులు, పెళ్లి ఫోటోలు, టెన్త్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.

  • రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి సబ్ రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలి.

  • ఆన్ లైన్ లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్ కు అందజేస్తే.. దాని పరిశీలన అనంతరం సాక్షుల సంతకాలు పెట్టించుకుని మ్యారేజీ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

  • హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం కూడా వెబ్ సైట్ లో ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. దీనికి ఓ నెల నోటీస్ పీరియడ్ ఉంటుంది.

  • ప్రత్యేక వివాహాల రిజిస్ట్రేషన్ కోసం నెల ముందు ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటే దానిపై రిజిస్ట్రేషన్ కార్యాలయం అభ్యంతరాల స్వీకరణకు నోటీసు బోర్డులో వివరాలు ఉంచుతారు. అభ్యంతరాలేవీ లేకపోతే నెల తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు.


Also Read: YSRCP News: నర్సరావుపేట అభ్యర్థి నాగార్జున యాదవేనా ? లావు రాజీనామాతో లైన్ క్లియర్ అయిందా ?