సస్పెన్షన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం మరో షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పెగాసస్‌ అంశంతో పాటు తన సస్పెన్షన్ గురించి ఆయన మార్చి 21వ తేదీన ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని .. షోకాజ్ నోటీసు అందిన వారంలోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారంలో సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ షోకాజ్ నోటీసు గత నెల 22వ తేదీనే అంటే ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతి రోజునే జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ షోకాజ్ నోటీసులో ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారో లేదో స్పష్టత లేదు. 


ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేదు. గత రెండేళ్ల నుంచి ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఆయన సర్వీసులో తప్పిదాలకు పాల్పడ్డారని ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్రం ఇంత వరకూ ఆ సిఫార్సుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చంద్రబాబు సీఎంగా ఉండగా పెగాసస్‌ను వాడారని బెంగాల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై పలు రకాల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వారిపై పరువు నష్టం దావా వేయడానికి చీఫ్ సెక్రటరీ అనుమతి కోసం లేఖ రాశానని తెలిపారు. అయితే సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ఆయన ఐపీఎస్ అధికారి కాబట్టి సీఎస్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించకూడదన్న నిబంధన ఉందని దీన్ని అధిగమించినందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది. 


ఇటీవల రెండేళ్ల సస్పెన్షన్ ముగిసింది. ఇక తన సస్పెన్షన్ పొడిగింపు కోసం కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వలేదని తన పూర్తి జీతం ఇవ్వాలని ఆయన సీఎస్‌కు లేఖ రాశారు. అలాగే తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై పరువు నష్టం దాఖలు చేసేందుకు అనుమతి కావాలని సీఎస్‌కు లేఖ రాశారు. వాటిపై సీఎస్  ఇంకా స్పందించలేదు.