AP Employees GPF Money : 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయం అయిన అంశం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వం తీసుకున్నట్లుగా అంగీకరిస్తే ఉద్యోగులు రిలాక్స్ గా ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. దాదాపుగా రూ. 800 కోట్లు మాయం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శిని కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయంపై ఫిర్యాదు చేశారు.
జీపీఎఫ్ సొమ్ము మాయం కావడంపై ఏమీ తెలియదన్న ఆర్థిక శాఖ
అయితే ఆర్థిక శాక ప్రత్యేక కార్యదర్శి.. అసలు ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము గురించి తమకేమీ తెలియదని తేల్చేశారు. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదనీ.. దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, కింది స్థాయి అధికారుల నుంచి నివేదిక తెప్పించి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. టెక్నికల్ సమస్య ఏమైనా ఉందేమో తెలుసుకుంటామని చెప్పడంతో ఉద్యోగులు ఏదో తేడా జరుగుతోందన్న అనుమానంలో ఉన్నారు.
ప్రభుత్వం సరిగ్గా సమధానం చెప్పడం లేదన్న ఉద్యోగ సంఘాల నేతలు
జీపీఎఫ్ ఖాతాలో రూ.800 కోట్లు మాయమైనట్లు భావిస్తున్నామని ఆర్థికశాఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల అకౌంట్‌ను హ్యాకింగ్ చేసినట్లు భావిస్తున్నామని ఉద్యోగ నేత సూర్యనారాయణ చెప్పారు. ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. గతేడాది వలే ఈ ఏడాదీ మా ఖాతాల్లో సొమ్ము పోయిందిని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్ చేసిన పని రాజ్యాంగ విరుద్ధమని.. పొరపాట్లు చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
సీఎంఎఫ్‌ఎస్‌లో సమస్య కావొచ్చని కొంత మంది ఉద్యోగ నేతల వివరణ
ఇంత జరిగినా ఏమీ తెలియనట్లుగా ఆర్థిక శాఖ అధికారులు చెబుతూండటంతో ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో పొరపాటు జరిగిందని అధికారులు చెబుతున్నారని.. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని మరికొంత మంది ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. అప్పుల లెక్కలు సరి చేసేందుకు ఇలా జీపీఎఫ్ సొమ్మును మళ్లిస్తున్నారని.. ఆడిట్ పూర్తయిన తర్వాత మళ్లీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉద్యోగుల అకౌంట్లలో నగదు వారి అనుమతి లేకుండా తరలించడం చట్టవిరుద్ధం. ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు.