ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షార్ట్ ఫిల్మ్ మేకర్లను ఆఫర్ ప్రకటించింది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌  పోటీలు ప్రకటించింది. ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఈ పోటీలను నిర్వహిస్తోంది. అయితే ఈ పోటీలన్ని మహిళలకే ప్రత్యేకం. మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో రూపొందించిన లఘు చిత్రాలు మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివితో ఉండేలా రూపొందించాలి.  


ఆరోగ్యశ్రీ ఫీజు రీయంబర్స్‌మెంట్, పేదలందరికీ ఇళ్లు, వైయస్‌ఆర్ ఆసరా, పించన్ల పెంపు, అమ్మఒడి, వైయస్‌ఆర్ రైతు బరోసా, జలయజ్ఞం, మద్యనిషేధం హామీలను ఏపీ ప్రభుత్వం నవరత్నాలుగా ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వైద్యం భరిస్తున్నారు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో మంచి ఆస్పత్రులను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చింది. 1వ తరగతి మొదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువుల వరకు పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరించేలా ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని రూపొందించారు. ప్రతి కుటుంబానికి లక్షన్నర ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 


ఇక పేదందరికి ఇళ్లు అనేది నవరత్నాల్లో భాగం. ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 30లక్షల పక్కా ఇళ్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వైఎస్ఆర్ ఆసరా,చేయూత పథకాలు మరో రత్నం.  పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు.  దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా వైఎస్సార్ చేయూత ద్వారా  రూ.75 వేలు దశలవారీగా అందచేస్తున్నారు.  పెన్షన్లను రూ. మూడు వేలకు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక అమ్మఒడిపథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థుల తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నారు. 


వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 నుంచి రూ.లక్ష వరకూ ప్రయోజనం ఉంటుంది. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్, ఉచిత భీమా, ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ ట్యాక్స్, టోల్ టాక్స్ మాఫీ వంటివి అమలు చేస్తున్నారు. ఇక నవరత్నాల్లో భాగగా జలయజ్ఞంను అమలు చేస్తున్నారు.     కృష్ణా, గోదావరి ఆయకట్టును స్థిరీకరిండం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను హరితాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. మద్య నిషేదాన్ని కూడా ప్రభుత్వం ఓ నవరత్నంగా నిర్ణయించింది. మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి.. వచ్చే ఎన్నికల నాటికి 5 స్టార్ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేస్తారు. 


ఈ నవరత్నాలపై షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి నవంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీతో పాటు షార్ట్‌ఫిల్మ్‌ కంటెంట్‌ను డీవీడీ, పెన్‌డ్రైవ్, బ్లూ రే ఫార్మాట్లలో డిసెంబర్‌ 31లోగా ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ కార్యాలయానికి పంపొచ్చు.