AP Movie Tickets New Rules : ఆంధ్రప్రదేశ్‌లో ఇక ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే సినిమా టికెట్ లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.  బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో  ప్రభుత్వం ఏపీ ఎఫ్ డీసీ  పోర్టల్ ‘యువర్ స్క్రీన్స్’ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ గెట్‌వే నుంచి టికెట్ బుకింగ్ చేసుకుంటే ప్రేక్షకుడిపై ఎలాంటి అదనపు భారం పడదు.  ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ విధానం వల్ల తాము నష్టపోతామని భావిస్తున్న  థియేటర్ల యాజమాన్యం, ఎగ్జిబిటర్లు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదలచేసింది. 


యువర్ స్క్రీన్స్  పేరుతో ఏపీఎస్‌ఎస్‌ఎఫ్‌డీసీ ఆన్‌లైన్ పోర్టల్ 


ఏదైనా కొత్త సినిమా విడుదలైందంటే  యువర్ స్క్రీన్స్ అనే పోర్టల్ ద్వారా తక్కువ ధరకే సినిమా టికెట్ బుక్ చేసుకుని ఇంటిల్లిపాది సంతోషంగా వినోదం ఆస్వాదించవచ్చని ప్రభుత్వం తెలిపింది.  ఇతర పోర్టల్ లలో టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ పై అదనంగా రూ.20 నుండి రూ.25 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుడిపై భారం పడుతుందని గ్రహించిన ప్రభుత్వం వాటికి అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచించి యువర్ స్క్రీన్స్ ను అందుబాటులోకి తేవడం ద్వారా ప్లాట్ ఫామ్ ఛార్జీగా టికెట్ పై  కేవలం 1.95 శాతం మాత్రమే అంటే సున్నా ఛార్జీ పడుతుందని ప్రకటనలో పేర్కొననారు.  ఆ లెక్కన ఒక్కో టికెట్ పై ప్రేక్షకుడికి సుమారు రూ.25 భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. 


ఇతర టిక్కెటింగ్ యాప్‌లూ ఉపయోగించుకోవచ్చన్న ప్రభుత్వం 


 ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో థియేటర్ల వారికి ప్రత్యేక ఏర్పాటు ఉంది. అగ్రిమెంట్ ఎవరైతే చేసుకున్నారో అప్పటికి ప్రభుత్వ ఎగ్జిస్టింగ్ జీవో ప్రకారం కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో థియేటర్ల వారికి తమ డబ్బు తమకు సక్రమంగా రాదనే అపోహలు అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. థియేటర్లకు రోజువారీగా అంటే ఏ రోజుకు ఆ రోజే డబ్బు బదలాయింపు జరుగుతుందని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇప్పటికే బుకింగ్ సర్వీస్ అందిస్తున్న అగ్రిగేటర్స్ కి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించిన నాటికి అంటే 17.12.2021 నాటికి ఉన్న అగ్రిమెంట్లను కొనసాగిస్తూ ఎంవోయూలో స్పష్టంగా తెలియజేయడం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


యువర్ స్క్రీన్స్ ద్వారా తక్కువ ధరకే టిక్కెట్లు 


ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్ బుక్ చేసుకునే అవకాశం థియేటర్లు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇందుకు అవసరమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను కూడా ప్రభుత్వమే అందిస్తుందని.. ప్రేక్షకుడు రేటుతో సంబంధం లేకుండా తనకు నచ్చిన పోర్టల్ నుండి  టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం టికెట్ రేటును నిర్ధేశించడం వల్ల రోజువారీగా ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి, ఎంత రేటుకి అమ్ముడయ్యాయి, ఎంత జీఎస్టీ వసూలైందనే వివరాలు తెలుస్తాయని తద్వారా పన్ను ఎగవేతకు అవకాశం ఉండదని, ప్రేక్షకుడికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది.