AP Govt BYJUS MOU : ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో కమిషనర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ అమెరికా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఎక్కడైన, ఏవిధంగానైనా చదువుకునేందుకు ఈ– లెర్నింగ్‌ కార్యక్రమంపై ఆయన చర్చించారు. 


బైజూస్ ఈ-లెర్నింగ్ యాప్ 


రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బైజూ రవీంద్రన్‌ సీఎం జగన్ తో చెప్పారు. ఇవాళ బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇప్పటి వరకూ కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.24 వేలు చెల్లిస్తే కాని బైజూస్‌ ఈ–లెర్నింగ్ అందుబాలోకి రావు. కానీ అలాంటి నాణ్యమైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు ఉచితంగా అందించనుంది. ఈ ఒప్పందం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పేద పిల్లల జీవితాలను ఈ కార్యక్రమం మారుస్తుందన్నారు. పిల్లలకు మంచి చదువులను అందించేందుకు ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. పదో తరగతి, సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో సహాయపడుతోందన్నారు. బైజూస్‌ ద్వారా నాణ్యమైన కంటెంట్ విద్యార్థులకు అర్థం అయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్‌ ప్రభుత్వ పాఠశాలలో 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ-లెర్నింగ్ అందుబాటులోఉంటుందన్నారు. 


రూ.500 కోట్లతో ట్యాబ్ లు 


బైజూస్ కంటెంట్ ను ప్రభుత్వం స్కూళ్లలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకోస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఇస్తామన్నారు. డిజిటల్‌ పద్ధతుల్లో నేర్చుకునే విధానం, పిల్లలకు అందుబాటులోకి వస్తుంది. దీంతో పదోతరగతి సీబీఎస్‌ పరీక్షలను సులభంగా ప్రిపేర్ అవుతారన్నారు. టీచర్లకు కూడా మంచి శిక్షణ లభిస్తుందన్నారు. ఉపాధ్యాయులు బోధనను మరింత నాణ్యంగా అందించగలరని తెలిపారు. విద్యార్థుల ట్యాబ్‌ల కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. విద్యారంగ వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చదిద్దడానికి బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ ముందుకు రావడం శుభపరిణామం అని సీఎం జగన్ అన్నారు. 


బైజూస్‌తో ఒప్పందం 


ప్రభుత్వం పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న పిల్లల సంఖ్య దాదాపుగా 32 లక్షల మంది ఉన్నారు. బైజూస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంతో వీరందరికీ లెర్నింగ్‌ యాప్ ద్వారా నాణ్యమైన విద్య అందుతుందన్నారు. 2025 నాటికి పదోతరగతి విద్యార్థులు అంటే ఇప్పటి 8వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ నమూనాలో పరీక్షలు రాస్తారన్నారు. ఈ యాప్‌తో పాటు అదనంగా ఇంగ్లీషు లెర్నింగ్‌ యాప్‌ కూడా ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఇందుకోసం విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లు సమకూర్చనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 4.7 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. 
బైజూస్‌లో లెర్నింగ్‌యాప్‌లో బోధన అత్యంత నాణ్యంగా బోధన అందనుంది. యానిమేషన్‌, బొమ్మల ద్వారా విద్యార్థులకు సులభంగా, సమగ్రంగా విద్యను అందజేయనున్నారు.