Deepavali Holiday 2023 in AP:  
అమరావతి: ఏపీ ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 13వ తేదీని (సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలియజేశారు. ఈమేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఓ 2167 ద్వారా 13వ తేదిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం కావడంతో ఒకేసారి పండుగకు మూడు సెలవులు వచ్చినట్లయింది. 


దీపావళి సెలవు తేదీలో మార్పు
ఏపీ ప్రభుత్వం దీపావళి సెలవు తేదీలో మార్పు చేసింది. ఇంతకుముందు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం దీపావళి సెలవు నవంబర్ 12న ఉంది. తాజాగా దీపావళి పండుగ సెలవును ఈ 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ సైతం విడుదల చేసింది. దాంతో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో మార్పు జరిగింది. నవంబర్ 13ను (సోమవారం) ఆప్షనల్ హాలిడే బదులుగా జనరల్ హాలీడేగా సర్కార్ ప్రకటించింది.