AP Assembly: అమరావతిలో ఇండియా ఇంటర్నేషనల్ లీగల్ యూనివర్సిటీ ప్రారంభం కానుంది. 2025-26 విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తామని.. విద్యా మంత్రి నారాలోకేష్ తెలిపారు. శాసనసభలో ఈ మేరకు బిల్లు ప్రవేశ పెట్టారు. పరిశోధనల ప్రోత్సాహానికి ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు ప్రవేశ పెట్టారు. నవంబర్ 26న బాలల అసెంబ్లీ నిర్వహణకు సభ ఆమోదం తెలిపింది.
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యక్తిగతంగా ప్రయత్నించి ఎపికి IIULER మంజూరు చేయించారని నారా లోకేష్ తెలిపారు. శాసనసభ తరపున గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనికి అనుబంధంగా అసోసియేట్ ఇనిస్టిట్యూషన్స్ ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నారా లోకేష్ చెప్పారు. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (IIULER), ఎపి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అడ్మిషన్లను కూడా 2025-26 లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో 20శాతం స్థానికులకే ఇవ్వాలని బిల్లులో పొందుపర్చాం. కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా పిజి, పిహెచ్ డి వంటి పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగుళూరులో ఏర్పాటుచేశారు. అది భారతదేశానికి మోడల్ లా యూనివర్సిటీగా మారింది. 1993లో చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల్లో లా యూనివర్సిటీలు ఏర్పాటుచేయాలని తీర్మానించారు. న్యాయ పరిశోధనకు మనదేశంలో మోడల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుచేయాలన్న లక్ష్యంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ను ఏర్పాటుచేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యాన ఇప్పటికే గోవాలో IIULER ఏర్పాటుచేసింది. ఈ బోర్డులో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు సభ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. ఈ యూనివర్సిటీకి అమరావతిలో 55ఎకరాలను చదరపు మీటర్ రూపాయి లీజు చొప్పున కేటాయించాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ యూనివర్సిటీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తారు. ఇందులో రాష్ట్ర కోటా 20శాతం ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వచ్చినపుడు పెద్దఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది. అందుకు అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). మహారాష్ట్ర, తమిళనాడుకు వెళ్లాల్సిన ఐఎస్ బిని చంద్రబాబునాయుడు పోటీపడి ఆనాడు హైదరాబాద్ కు తీసుకెళ్లారు. దానివల్ల హైదరాబాద్ లో ఆ ప్రాంత రూపురేఖలు మారాయి. అక్కడ విద్యనభ్యసించిన అన్ని సామాజిక వర్గాల వారు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఎపిలో ప్రతిష్టాత్మక సంస్థలను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఎపి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను మంత్రి నారా లోకేష్ సభలో ప్రవేశపెట్టారు. విశ్వవిద్యాలయాల్లో హైక్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చి ఓరియంటెడ్, ఇండస్ట్రీ రిలవెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా 11-1-2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేటు యూనవర్సిటీ యాక్ట్ ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటుకు అనుమతించాలని నిర్ణయించారు. దీనిద్వారా రాష్ట్రంలో 14ప్రైవేటు యూనివర్సిటీలు వచ్చాయి. యాక్ట్ 40, 2023ని గత వైసిపి ప్రభుత్వం అనాలోచితంగా టాప్ -100 గ్లోబల్ వర్సిటీలతో కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ ఉంటేనే అనుమతించాలని నిబంధన విధించింది. యుజిసి 2022లో న్యాక్ 3.0 లో కనీసం 3 గ్యాడ్యుయేట్ బ్యాచ్ లు, ఎన్ ఐఆర్ఎఫ్ టాప్ -100 ఉంటేనే జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని యుజిసి చెప్పింది. న్యాక్ అర్హత సాధించడానికి గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీలకు కనీసం ఆరు సంవత్సరాలు పడుతుంది. గత ప్రభుత్వం విధించిన నిబంధన వల్ల ఎపికి ప్రైవేటు యూనివర్సిటీలు రాలేదు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలను ఎపికి రప్పించాలన్న ఉద్దేశంతో జాయింట్ సర్టిఫికేషన్ నిబంధనను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతిఏటా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు. మెగా డిఎస్సీ నిర్వహణ కూటమి ప్రభుత్వానికి గర్వకారణమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం రోజున బాలల అసెంబ్లీ నిర్వహణకు మంత్రి లోకేష్ ప్రతిపాదించగా, శాసనసభ ఆమోదం తెలిపింది. గత సమావేశాల్లో బాలల అసెంబ్లీ నిర్వహణని ప్రతిపాదించా. చట్టసభల నిర్వహణపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే సమాజంలో మనం ఆశిస్తున్న మార్పు వస్తుంది. కేవలం హక్కులేకాదు, బాధ్యతలు కూడా ఉంటాయని బాలలకు తెలుస్తాయని అన్నారు.