Village Secretariats to Vision Units: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయాల పేరును 'విజన్ యూనిట్స్'గా మారుస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక నుంచి ఈ యూనిట్లు ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందించే కేంద్రాలుగా రూపొందుతాయని ప్రకటించారు. రాష్ట్రంలోని 13,326 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ మార్పు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వచ్చిన 'స్వర్ణాంధ్ర విజన్ 2047'కు అనుగుణంగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
అమరావతిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. గ్రామ సచివాలయాలను మరింత ఎఫెక్టివ్‌గా మార్చాల్సి ఉందని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఇక నుంచి వీటిని 'విజన్ యూనిట్స్'గా పిలుస్తామని.. ఇవి ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా, గ్రామీణ వికాసానికి విజనరీ ప్లాన్‌లు రూపొందించే యూనిట్లుగా పనిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను జగన్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకు వచ్చారు. ప్రతి రెండు వేల మందికి ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒక్కో దాంట్లో పదమూడు మంది సిబ్బందిని నియమించారు. పంచాయతీ కార్యాలయాలు చేయాల్సిన పనులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలు చేయడం ప్రారంభించాయి. అదే సమయంలో సిబ్బందికి పని ఉండటం కష్టమయింది. నియామకాలపైనా ఎన్నో వివాదాలు వచ్చాయి.
ప్రభుత్వం మారిన తరవాత సచివాలయ ఉద్యోగుల్ని ఎక్కువగా ఎలా ఉపయోగించుకోవాలన్నదానిపై కసరత్తు జరిపారు. వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. కొంత మందితో పెన్షన్లు పంపిణీ చేయిస్తున్నారు. మిగిలిన వారికి కొత్త బాధ్యతలు అప్పగించాలని.. మొత్తం వ్యవస్థను సంస్కరించాలని నిర్ణయించారు. అందుకే విజన్ యూనిట్స్ గా మార్చాలని డిసైడయ్యారు.