AP government announces New BAR policy:   ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త బార్ పాలసీ 2025–28ను ప్రకటించింది. బార్‌ల నిర్వహణలో పారదర్శకత, ఆర్థిక స్థిరత్వం, సామాజిక సమగ్రతను సాధించడమే ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశమని ఆబ్కారీశాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్ సోమవారం మంగళగిరిలోని కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు.  ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నెం. 275 (తేదీ 13.08.2025) ప్రకారం రాష్ట్రంలో మొత్తం 840 బార్లకు లైసెన్సులు ఇస్తారు.  అదనంగా 10 శాతం బార్‌లు గీతకులాలకు కేటాయిస్తారు.  వీటికి లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ లభిస్తుంది. దీని ద్వారా సామాజిక సమానత్వం, సాధికారతను ప్రోత్సహించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. 

డ్రా ఆఫ్ లాట్స్‌ ద్వారా కేటాయింపు              

అన్ని బార్ లైసెన్సులు పూర్తిగా పారదర్శకంగా డ్రా ఆఫ్ లాట్స్ విధానం ద్వారా కేటాయిస్తారు.  ప్రతి బార్‌కు కనీసం నాలుగు చెల్లుబాటు అయ్యే దరఖాస్తులు ఉండాలి. ఇలా చేయడం ద్వారా పోటీ పెరుగుతుందని, అడ్డదారుల దరఖాస్తులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.  ఇటీవల ఏపీలో రిటైల్‌ షాప్‌ల కేటాయింపులో ఒక దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో ఇటీవల బార్‌ల కేటాయింపులో ఒక్కో బార్‌కు 131 దరఖాస్తులు అందాయి. దీన్ని ప్రభుత్వం పరిశీలించింది. 

లైసెన్స్ కాలపరిమితి, ఫీజు నిర్మాణం              

కొత్త పాలసీ ప్రకారం బార్ లైసెన్స్ గడువు మూడు సంవత్సరాలపాటు ఉంటుంది.   01.09.2025 నుండి 31.08.2028 వరకు అమలులో ఉంటుంది. లైసెన్స్ ఫీజు చెల్లింపులను సరళతరం చేశారు. 50,000 లోపు జనాభా గల పట్టణాల్లో రూ.35 లక్షలు, 50,001 నుండి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 5 లక్షలకు పైబడిన నగరాల్లో రూ.75 లక్షలు ఫీజు ఉండనుంది. అన్ని విభాగాల్లో ప్రతి ఏడాది పది శాతం రుసుము పెంచుతారు. 

ఆరు వాయిదాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించే చాన్స్ 

లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాలలో చెల్లించవచ్చు. ఒక వాయిదా మొత్తానికి సమానంగా బ్యాంకు గ్యారంటీ సమర్పించాలి. బార్‌లను నగర పాలక సంస్థల పరిధిలో, పర్యాటక కేంద్రాల్లో , భవిష్యత్తులో పరిశ్రమల కారిడార్లు, మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంతాలు, ఎస్‌ఈజెడ్‌లలో అనుమతిస్తారు. తిరుపతిలో అలిపిరి వైపు వెళ్లే ముఖ్య మార్గాలలో బార్‌లకు నిషేధం విధించారు.అధ్యాత్మిక ప్రాంతాల్లోనూ అనుమతి ఉండదు. 

గత ప్రభుత్వం కన్నా తక్కువ ఫీజులు             

రిటైల్‌ షాప్ లైసెన్స్ రుసుముల కంటే తక్కువ స్థాయిలో కొత్త బార్ ఫీజులు నిర్ణయించడం ద్వారా రమారమి మూడేళ్లపాటు స్థిరమైన ఆదాయ విధానానికి మార్గం సుగమం అవుతుందని  ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో కొన్నింటి లైసెన్స్‌లు  వేలం పాట్ల తర్వాత కూడా, ఖాళీగా మిగిలిపోయాయని, కొత్త పాలసీ అలాంటి సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.   కొత్త పాలసీ కొత్త వ్యాపారవేత్తలకు, ప్రస్తుత లైసెన్స్ దారులకు సమాన అవకాశాలు కల్పిస్తుంది.  ఈ విధానంలో రెస్టారెంట్ ప్రారంభానికి ఒక నెల రోజుల వెసులుబాటు ఉంటుంది.