AB Venkateswararao Letter : వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, సీపీఆర్వో పూడి శ్రీహరి మీద పరువు నష్టం దావా వేసేందుకు అనుమతివ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ జీఏడీ కార్యదర్శికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి(Mla chevireddy bhaskar reddy), సీపీఆర్వో శ్రీహరి(Pudi Srihari)తో సహ ఓ తెలుగు పేపర్, ఛానెల్, ఆ పేపర్ ఎడిటర్ మురళిపై పరువు నష్టం దావా వేస్తానని లేఖలో పేర్కొన్నారు.
సీపీఆర్వో శ్రీహరి తప్పుడు ప్రచారం
తన సస్పెన్షన్ విషయంలో తప్పుడు సమాచారంతో కూడిన ఆరు పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియాకు విడుదల చేశారని పూడి శ్రీహరిపై ఏబీవీ(ABV) అభియోగం చేశారు. తనపై పూడి శ్రీహరి ప్రచారం చేసిన విషయాలేవీ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో లేవని స్పష్టం చేశారు. విచారణ సందర్భంలో కూడా తనపై జరిగిన దుష్ప్రచారంలోని అంశాల ప్రస్తావనకు రాలేదన్నారు. పూడి శ్రీహరి ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా తనపై మీడియాలో దుష్ప్రచారం జరిగిందని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో ఆవేదన చెందారు. తానే కాకుండా తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ కథనాలు బాధ కలిగించాయని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ లేఖ కాపీని సీఎస్ సమీర్ శర్మ(CS Sameer Sharma)కు కూడా పంపారు ఏబీవీ.
గతంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణలు
గతంలో తిరుపతిలో మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏబీవీ పాస్ పోర్టు(Passport) సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పలు ఆరోపణలు చేశారు. తనపై చెవిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని ఏబీ వెంకటేశ్వరరావు తాజా లేఖలో ఆరోపించారు. చెవిరెడ్డిపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత సర్వీసుల(ప్రవర్తన) నిబంధనలు, 1968 ప్రకారం లేఖలో పేర్కొన్న వ్యక్తులు, మీడియా సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తన 30 ఏళ్ల సర్వీస్ లో ఎప్పుడు అవినీతి పాల్పడలేదని ఏబీవీ అన్నారు. తన సర్వీస్ ఎన్నో అవార్డులు , రివార్డులు పొందానని లేఖలో పేర్కొన్నారు. తనపై వచ్చిన అభియోగాలు రుజువు కాలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోడానికి అనుమతి ఇవ్వాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.