ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కల్పిస్తునన ఉచిత వసతి సౌకర్యం గడువును వచ్చే జూన్‌ 26వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వసతి పొడిగింపుపై సెప్టెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగుల ఉచిత వసతి వివరాలు సేకరిస్తోంది. ఉచిత వసతి పొందే ఉద్యోగుల పూర్తి వివరాలు పంపించాలని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలకు సాధారణ పరిపాలన శాఖ నోట్‌ పంపింది. సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్‌, హైకోర్టు ఉద్యోగులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల్లో ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ముందుగా అత్యవసరంగా ఉద్యోగుల ఐడీ నకళ్లు పంపించాలని హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ చేసింది.


2024 జూన్ వరకూ ఉచిత వసతి పొడిగింపు


హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకూ ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి సదుపాయాలను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా విజయవాడ, గుంటూరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన వసతి సదుపాయాలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, హెచ్‌వోడీలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు ఈ వసతి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.


వారానికి ఐదు రోజుల పనిదినాలు


2016 సెప్టెంబర్‌ నుంచి హైదరాబాద్‌ నుంచి ఏపీ ప్రభుత్వ కార్యాలయాల తరలించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారు విద్యా సంవత్సరం మధ్యలో కుటుంబాలతో సహా తరలి రావడం కష్టమనే ఉద్దేశంతో వారికి వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఉచిత వసతి సదుపాయాలను కల్పించారు అప్పటి ముఖయమంత్రి చంద్రబాబు. ఏడాది పాటు మాత్రమే ఆ సదుపాయం ఇస్తామని చెప్పినా ఉద్యోగ సంఘాలు రకరకాల సాకులతో దానిని ఏడాదికి ఆ ఏడాది పొడిగించుకుంటూ వచ్చాయి.


దాదాపు ఎనిమిదేళ్లుగా వందలాది మంది ఉద్యోగులు తమ కుటుంబాలతో హైదరాబాద్‌లో ఉంటూ అమరావతిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం విధుల నుంచి వెళ్లిపోయి సోమవారం మధ్యాహ్నానికి తీరిగ్గా విధుల్లో చేరడం పలువురికి అలవాటై పోయింది. దీంతో సచివాలయం, హెఓడి కార్యాలయాల్లో విధులకు అటంకం కలుగుతున్నట్లు గుర్తించినా ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్టు వదిలేశారు. 2019లో అధికారం మారిన వెంటనే ఈ పరిస్థితిని గమనించిన జగన్ 2020 జూన్‌ నుంచి ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగించేది లేదని తేల్చి చెప్పారు.


రెండు నెలల కిందట మరో సారి జూన్ 30 వరకూ ఉచిత వసతి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు పొడిగింపు వర్తించేలా నిర్ణయం తీసుకుంది. మిగతా వారు ఇప్పటికే సొంత వసతిని చూసుకున్నారు. పలువురు ఉద్యోగులు ఇప్పటికీ పిల్లల చదువులు....ఇతర అవసరాల కోసం  హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.