ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు,పెన్షన్లు విడతల వారీగా పదో తేదీకైనా సర్దుబాటు చేస్తున్నారు. కానీ కీలకమైన విద్యుత్ సంస్థల సిబ్బందికి మాత్రం ఎప్పుడు జీతాలు అందుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 13వ తేదీ వచ్చినా విద్యుత్ సంస్థల ఉద్యోగులకు జీతాలు అందలేదు. దాంతో వారంతా ఆందోళనలు ప్రారంభించారు. ఎందుకైనా మంచిదని ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. విద్యుత్ సంస్థల్లో సిబ్బంది ఎవరైనా సమ్మె చేస్తే ఎస్మా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జీతం అడిగితే ఎస్మా ప్రయోగించడం ఏమిటని ఉద్యోగులు మథనపడుతున్నారు. 


ఏపీ విద్యుత్ ఉద్యోగులు జీతాల కోసం రెండు రోజుల నుంచి  విద్యుత్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నారు.  ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం చేస్తోన్నామని... ఎప్పుడూ ఒకటో తేదీన వేతనాలు బ్యాంకు ఖాతాలో ఠంఛనుగా జమ అయ్యేవని కానీ ఇప్పుడు 13 రోజులు దాటినా జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సకాలంలో జీతాలివ్వకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.  బ్యాంకుల అప్పులకు ఈఎంఐలు, ఇంటి అద్దెలు కట్టలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఖర్చులకూ డబ్బులేని స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం వెంటనే తమకు జీతం చెల్లించే ఏర్పాట్లు చేయాలని... లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామంటున్నారు.  


మూడు డిస్కంల పరిధిలో ఎవ్వరికీ ఇంతవరకూ వేతనాలు అందలేదు.  విద్యుత్‌ శాఖలోని విశ్రాంత ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్‌ డబ్బులు పడని పరిస్థితి. డిసెంబరు నెల నుండి విద్యుత్‌ శాఖలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందడం లేదు.  డిసెంబరు నెల వేతనాలు సంక్రాంతి పండుగ తరువాత జనవరి 17న జమ చేశారు. ఫలితంగా అతి పెద్ద పండుగను జరుపుకోలేపోయామని తెలిపారు. అలాగే, జనవరి నెల వేతనాలు కూడా ఫిబ్రవరి రెండో వారంలో జమ చేయగా, ఫిబ్రవరి నెల వేతనాలు మార్చి రెండో వారంలో జమ చేశారని పేర్కొంటున్నారు. ఇక, మార్చి వేతనం ఏప్రిల్‌ 2 ఉగాది తరువాత 8వ తేదీ వేశారని, ఏప్రిల్‌ వేతనం మే నెల 13వ తేదీ వచ్చినప్పటికీ ఇంతవరకూ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు.


విద్యుత్‌ శాఖ సకాలంలో సిబ్బందికి వేతనాలు అందించకపోడంతో సుమారుగా 64 వేల మంది ఉద్యోగులు ఇబ్బందులపాలవుతున్నారు. ఇందులో మూడు డిస్కంల పరిధలో పనిచేస్తున్న సుమారు 24 వేల మంది ఉద్యోగులతోపాటు మరో 40 వేల మంది వరకూ పెన్షనర్లు ఉన్నారు.  శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవులు కావడంతో   తిరిగి సోమవారం అంటే ఈనెల 16వ తేదీనే జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. విద్యుత్‌ కొరత ఉందని, కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నందున ఉద్యోగుల జీతాలకు సమస్యగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.