తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా ఇప్పుడు ఏపీలోనూ సాధారణ ఎన్నికల సమరానికి సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో 2024, మార్చిలో సాధారణ ఎన్నికల నిర్వహించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450 ఉండగా, కొత్తగా ఓటర్ల చేరిక, మరణించిన వారి పేర్ల తొలగింపు, ఓ నియోజకవర్గం నుంచి మరో చోటుకు బదిలీ వంటి ప్రక్రియ అనంతరం పూర్తి స్థాయి జాబితాను 2024, జనవరి 5న విడుదల చేస్తామని చెప్పారు.
ఆన్ లైన్ లో జాబితా
ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని, ఓటర్లు తమ అభ్యంతరాలను డిసెంబర్ 9 వరకూ తెలియజేయొచ్చని ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. డిసెంబర్ 26లోగా వాటిని పరిష్కరిస్తామని, తుది ఓటర్ల జాబితాను జనవరి 5న ప్రకటిస్తామని వివరించారు. మొత్తం 6 అంశాల ఆధారంగా సాంకేతికత సాయంతో సుమారు 10 లక్షల బోగస్ ఓట్లు గుర్తించి తొలగించామని చెప్పారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.
స్పెషల్ డ్రైవ్
ఓటర్ల జాబితా సవరణల విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్ లైన్ లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాపై ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవంబర్ 4, 5, డిసెంబర్ 2, 3 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ డ్రైవ్ లో జాబితాలో తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
కొత్త ఓటర్ల నమోదు ఇలా
2023, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారెవరైనా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. గతంలో అప్లై చేసుకోని వారు సైతం డిసెంబర్ 9 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆన్ లైన్ లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. 2024, ఏప్రిల్ 1 లేదా జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారెవరైనా కూడా ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
చెక్ చేయండిలా
ఏపీలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని, ఓటర్లు తమ ఓటరు కార్డు ఉందో లేదో చెక్ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా సూచించారు. ఈసీ అధికారిక వెబ్ సైట్ https://voters.eci.gov.in/ లోకి వెళ్లి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీ పోలింగ్ బూత్ ల వారీగా మీ ఓటు ఉందో లేదో తెలుస్తుందన్నారు.
ఓటర్ల లెక్కలు ఇలా
ఈసీ డ్రాఫ్ట్ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లుండగా, మహిళా ఓటర్లు 2,03,85,851 మంది, పురుష ఓటర్లు 1,98,31,791 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 68,158 మంది, థర్డ్ జెండర్ 3,808 మంది ఉన్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19,79,775 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,40,857 మంది ఓటర్లున్నారు.
Also Read: ఏపీలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల - మొత్తం ఎంతమంది ఓటర్లంటే?