AP Election Counting Agents: ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తుండడంతో ఏపీలోని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో గెలుపు తమదంటే కాదు తమదంటూ చెప్పుకుంటున్నా.. ఓటర్ మహాశయుడు ఎవరి వైపు మొగ్గుచూపారో అనే ఆందోళన లోలోన ఉంది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల్లో బలంగా నిలిచే, పార్టీ విజయాన్ని డిసైడ్ చేసే వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉన్నవారిని, నిబంధనలపై పట్టున్న వ్యక్తులను ఎంపిక చేసి కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధానంపై రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి.
అనుక్షణం అప్రమత్తత అవసరం
కౌంటింగ్ హాళ్లలో ఘర్షణలకు దిగే అవకాశం ఉందని, ఉద్రిక్తత రేకెత్తించే ప్రణాళికలు ఉన్నాయంటూ టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీలు సూచిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని ఆయా పార్టీల పెద్దలు సూచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్‌వైజర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లదేనని, తమ పార్టీ ఏజెంట్లు అక్కడ జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
లిఖిత పూర్వకంగా ఫిర్యాదు
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే కౌంటింగ్ ఏజెంట్లు కచ్చితంగా లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు అందజేసి అక్నాలెడ్జ్‌మెంట్ (ధ్రువీకరణ) పత్రం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నోటితో అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడదని, ప్రతీది లిఖితపూర్వకంగా తెలియజేయాలని పదే పదే సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేసిన బూతుల్లో వీవీ ప్యాట్‌లు లెక్కిస్తారు. ఈవీఎంలలో పడిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు తేడా ఉంటే ఫైనల్‌గా వీవీ ప్యాట్లలోని ఓట్లనే పరిగణిస్తారు. ఈ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా పార్టీలు తమ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తున్నాయి.
ఆ సయమంలో రీ కౌంటింగ్ హక్కు
ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లకు సూచిస్తున్నాయి. ఈవీఎంలలో ఓట్ల వివరాలు, కౌంటింగ్ సిబ్బంది ద్వారా స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని ఆయా పార్టీల పెద్దలు కోరుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచి చిట్ట చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలని, లెక్కింపు పూర్తయి గెలిచిన అభ్యర్థి ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వాతే బయటకు రావాలని అవగాహన కల్పిస్తున్నారు. కౌంటింగ్‌లో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్ కోరాలని ఏజెంట్లకు సూచిస్తున్నారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
మంగళవారం ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు ప్రారంభం కానుంది. ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్‌గా ఉంటున్న వ్యక్తులు భారత ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం రెండూ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటింగ్ కేంద్రంలోకి ఫారం–17 సీ, పెన్ను లేదా పెన్సిల్, తెల్ల కాగితాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. ఈ క్రమంలో ప్రతి రౌండ్ కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయా పార్టీల పెద్దలు ఏజెంట్లకు సూచిస్తున్నారు.