AP Heavy Rain Alert | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు గంటల్లో వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Continues below advertisement

ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 

ఈ అకాల వర్షాల సమయంలో గంటకు 40- 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ప్రజలకు ఆయన సూచించారు.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు తీవ్రమైన వడగాలులు

మరోవైపు, వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. సోమవారం నాడు చింతూరు, ఇబ్రహీంపట్నం వంటి మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, సురక్షితమైన భవనాల్లో ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో వాతావరణం అస్థిరంగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఆదివారం (ఏప్రిల్ 6న) ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 42.4°C ఉష్ణోగ్రత నమోదవగా, తిరుపతి, మార్కాపురం, కడప, కృష్ణా జిల్లాల్లో కూడా ఎండలు 41 డిగ్రీలు దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్రమైన ఎండలు, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేవారు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలని కోరారు.