Andhra News :    ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో రావివారిపాలెంలో  మూడు రోజుల కిందట దారుణ హత్యకు గురైన హనుమాయమ్మ అంశంపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు.  హనుమాయమ్మను అదే గ్రామానికి చెందిన కొండలరావు ట్రాక్టర్ తో గుద్ది హత్య చేశారని..  నిందితుడు కొండల రావు అరెస్ట్ విషయంలో పోలీసుల వైఖరిపై  ఛాలా అనుమానాలు ఉన్నాయన్నారు.  కేసులో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని, డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చామని..  ఇది ఘోరమైన సంఘటన ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.  నిందితుడిని అదుపులోకి తీసుకుని త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడతామన్నారు. 


ట్రాక్టర్‌తో తొక్కి హనుమాయమ్మ దారుణ హత్య 


 రాజకీయ కక్షల కారణం   అంగన్‌వాడీ టీచర్ అయిన   50 ఏళ్ల  హనుమాయమ్మను   ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో మూడు రోజుల కిందట జరిగింది.  రావివారిపాలేం గ్రామంలో సవలం సుధాకర్   టిడిపిలో ఎస్‌సి సెల్ మండల అధ్యక్షుడిగా ఉన్నారు.  సుధాకర్ భార్య హనుమాయమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తుంది. కొండపి టిడిపి ఎంఎల్‌ఎ డోలా బాలవీరాంజనేయ స్వామికి అనుచరుడిగా సుధాకర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఊరికి చెందిన సవలం కొండలరావు వైసిపి కార్యకర్తగా ఉన్నాడు. సుధాకర్ రాజకీయంగా ఎదుగుతుండడంతో పాటు కొండలరావు పొలం విషయంలో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరిలో ఒకరిని చంపుతానని కొండలరావు పలుమార్లు బెదిరించాడు. హనుమాయమ్మ అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం తన ఇంటికి వచ్చింది. ఇంటి ముందు నిలబడి తన కుమార్తెను నీళ్లు ఇవ్వమని అడిగింది. ఆమె నీళ్లు తాగుతుండగా అక్కడే వేచి ఉన్న కొండల్ రావు ట్రాక్టర్‌తో గొడను ఢీకొట్టాడు. వెంటనే ఆమె కింద పడిపోవడంతో ఇంకా మృతి చెందలేదని నిర్ణయించుకొని ట్రాక్టర్‌తో తొక్కించి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె కూతురు కేకలు వేయడంతో వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు చెప్పారు.  


హనుమాయమ్మ హత్యపై పోలీసుల మౌనం 


అయితే ఈ హత్య విషయంలో ప్రకాశం జిల్లా పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. కేసు నమోదు చేయడమే కాదు.. నిందితుడ్ని అరెస్ట్ చేయడంలోనూ నిర్లక్ష్యం చూపిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ దళిత మహిళను రాజకీయ కక్షలతో దారుణంగా హత్య చేస్తే  పోలీసులు ఏ మాత్రం స్పందించకపోగా నిందితులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల తర్వాత స్పందించిన డీజీపీ కూడా..  పోలీసుల తీరు సందేహంగా ఉందని పేర్కొనడం సంచలనంగా మారింది. 


కేంద్ర సంస్థల దర్యాప్తు కోసం చంద్రబాబు డిమాండ్ 
 
దళిత మహిళ హనుమాయమ్మ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని, డిజిపికి మంగళవారమే చంద్రబాబు లేఖ రాశారు. హత్యపై జోక్యం చేసుకోవాలని కోరుతూ.. నేషనల్‌ ఎస్‌సి కమిషన్‌, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌, నేషనల్‌ మహిళా కమిషన్‌కు లేఖలు రాశారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, బడుగువర్గాల హక్కులు హరించబడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. హత్య ఘటనలో వైసిపి నేతలకు పోలీసుల సహకారంపైనా విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.  నిందితుని గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఆయన్ను అరెస్టు చేయకపోగా, పారిపోయేందుకు సహకరించారన్నారు.