AP Deputy CM Pawan Kalyan Taking Prayaschitha Deeksha for 11 days | అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలియగానే నా మనసు వికలమైంది, అపరాధ భావానికి గురైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. అందులో భాగంగానే తాను 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఆదివారం ఈ దీక్షను ప్రారంభింస్తారు.
22 సెప్టెంబర్ (ఆదివారం) నాడు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఈ దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. 11 రోజులపాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. గత పాలకులు నీ పట్ల చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వాలని శ్రీవెంకటేశ్వరస్వామిని వేడుకుంటాను అన్నారు.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే తిరుమల లాంటి ఆలయాలపై ఇలాంటి అకృత్యాలు చేస్తారంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ప్రజలు గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ టీటీడీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం ఇలాంటి తప్పిదాలను కనిపెట్టలేదు. ఒకవేళ గుర్తించినా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. గత వైసీపీ రాక్షస పాలకులకు భయపడి వారు మౌనంగా ఉన్నారేమోనని వ్యాఖ్యానించారు.
‘తిరుమల పవిత్రతకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా గత ప్రభుత్వం హిందూ ధర్మంపై చేసిన అపచారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర మనోక్షోభకు గురి చేసింది. ధర్మం వైపు అడుగులు వేసే సమయం ఆసన్నమైంది. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకంగా మారుతోంది. ప్రజా క్షేమం కాంక్షించి నా వంతుగా ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు దీక్ష చేపట్టాలని సంకల్పం తీసుకున్నాను. ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read: AP Floods: ఏపీలో వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన, తేదీ ఫిక్స్