Pawan Kalyan Review on Swatch Andhra: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించింది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ లు పని మొదలెట్టేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5ఏళ్ల వైసీపీ పాలనపై జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ వ్యవహారంపై బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షలో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో రూ.2092.65 కోట్ల నిధులు ఉంటే..  ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిల్చారా అంటూ మంత్రి పవన్ కళ్యాణ్ విస్మయం చెందారు.


 ముఖ్యంగా నాలుగేళ్ల క్రితం రెండు వేల కోట్లుగా ఉన్న నిధి కాస్తా ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలే ఉండడం పై మంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదిక కోరారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్ కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై మంత్రి పవన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై అధికారులతో చర్చించారు.


అధికారులపై పవన్ ప్రశ్నల వర్షం
2020-21లో రూ.728.35 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించింది. 2021-22లో రూ.508 కోట్లు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తించారు.  ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.1066.36 కోట్లు ఖాతాలో ఉన్నాయని,  అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే నాటి కార్పొరేషన్ ఖాతాలో రూ.3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో నమోదు అయిందన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్లాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.70కోట్లు నిధులు మంజూరు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు అందించింది. వాటిలో రూ.46 కోట్లు ఖర్చు చేసింది.


2023-24లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో రూ.239 కోట్లు నిధులు సమకూరాయి.  రూ.209 కోట్లు మేర ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి రూ.7.04 కోట్లు మాత్రమే.. ఇవి ఐదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని.. అసలు నిధులు ఏమయ్యాయి అని పవన్ అధికారుల పై ప్రశ్నల వర్షం కురిపించారు.


వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
నిధుల గోల్‌మాల్‌పై ఆ కార్పొరేషన్‌‌ అధికారులు వివరాలు చెబుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు సక్రమంగా వినియోగించుకుంటేనే  ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని పవన్ అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తున్నా వాడకుండా ఇతర అవసరాలకు మళ్లించడం చాలా దురదృష్టకరమన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేశారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.