Pawan Kalyan Review On Cluster Division: గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ కొత్త రూపు సంతరించుకోనుంది. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని.. దీని కోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. ఈ మేరకు శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి.. కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు.
గతంలో పంచాయతీల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని క్లస్టర్ గ్రేడ్ల విభజన జరిగిందని.. నూతనంగా జనాభాను కూడా జోడించి పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లు విభజించాలని అధికారులకు నిర్దేశించారు. ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉండి, ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండే సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా క్లస్టర్ గ్రేడ్ల విభజన చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకొని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విదానంలో సిబ్బందిని నియమించుకోవాలన్నారు.
గ్రేడ్ల కేటాయింపుపై కమిటీ
మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యత అయిన తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగుదలకు తగినంత మంది సిబ్బంది ఉండాలని పవన్ అధికారులకు సూచించారు. వీటిపై అధ్యయనం చేసి పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీ వేయాలని పవన్ తెలిపారు. కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లా ఒక యూనిట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పంచాయతీల ఆదాయం, జనాభాను ప్రాతిపదికన జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కమిటీ పరిశీలిస్తుంది.
అనంతరం పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనకు సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి కమిటీ నివేదించనుంది. దీనిని అనుసరించి గ్రేడ్ల ప్రకారం పంచాయతీ, సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలు రూపొందిస్తారు. తద్వారా సిబ్బందిని ఉపయోగించకోనున్నారు.
ఆ డ్రోన్ గుర్తింపు
మరోవైపు, ఈ నెల 18న జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ వ్యవహారంపై విచారించిన పోలీసులు అది ప్రభుత్వ డ్రోన్‌గా తేల్చారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్‌గా గుర్తించిన పోలీసులు.. సర్వేలో భాగంగానే కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు చెప్పారు. కాగా, ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తుండగా.. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.
Also Read: RaghuRama plea on Jagan: జగన్‌పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం