Pawan Kalyan Key Comments On His Salary: తాను పూర్తి జీతం తీసుకుని పని చేద్దామనుకున్నానని.. కానీ పంచాయతీ రాజ్ శాఖలో నిధుల్లేవు. ఎన్ని రూ.వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని అందుకే జీతం వదిలేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరిచేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పా. దేశం కోసం నేల కోసం పని చేస్తా' అని స్పష్టం చేశారు.


'టైం తీసుకున్నా'


భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని.. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 'అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచాం. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియడం లేదు. రుషికొండలో రూ.వందల కోట్లతో ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఆ నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయి. గతంలో జలజీవన్ మిషన్ నిధులున్నా ఉపయోగించలేదు.' అని పవన్ పేర్కొన్నారు.


'అలా చేస్తేనే ఆనందం'


తనకు గెలిచినందుకు ఆనందంగా లేదని.. పని చేసి మన్ననలు పొందితేనే నిజమైన ఆనందమని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే నేనున్నానని.. విజయయాత్రలు మాత్రమే చేయడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. 'క్యాంప్ ఆఫీసులో మరమ్మతుల గురించి అడిగితే ప్రస్తుతానికి ఏమీ చెయ్యొద్దని చెప్పా. అవసరమైతే కొత్త ఫర్నీచర్ నేనే తెచ్చుకుంటానని చెప్పా. సచివాలయం నుంచి సిబ్బంది వచ్చే వేతనాలకు సంబంధించి పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు మనస్కరించలేదు. జీతం తీసుకుని పని చేద్దామనుకున్నా. శాఖ అప్పుల్లో ఉంటే నేను జీతం తీసుకోవడం కరెక్ట్ కాదని నా జీతం వదిలేస్తున్నా. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభ వెలికితీయాలి. పిఠాపురాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపించాలి. కాలుష్యం లేని పరిశ్రమలు ఇక్కడికి రావాలి. అన్ని పనులూ చిటెకలో కావు. కానీ అయ్యేలా పని చేస్తాం. పార్టీకి ఓటు వేయకున్నా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది.' అని పవన్ పేర్కొన్నారు.


వాలంటీర్లపై..


వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లనే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రభుత్వ పథకాలు అందించారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయనే ప్రచారం చేశారని.. ఇప్పుడు ఎక్కడా ఆగలేదని అన్నారు. ఇంటి దగ్గరికే పెన్షన్లు వచ్చాయని చెప్పారు. ఒక్కో సచివాలయానికి 10 మంది ఉద్యోగులు ఉన్నారని.. ఒక్క రోజులోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా ఇవ్వాలో తాము ఆలోచిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బాధ్యత, జవాబుదారీతనం ఉంటుందని.. ఇకపై ఎవరూ డబ్బులు అడగరని అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి, కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.


Also Read: CM Chandrababu: 'చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూస్తారు' - సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మధ్య నవ్వుల పువ్వులు