Deputy CM Pawan Kalyan Visit Kondagattu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు 3 రోజుల పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. తొలిరోజు గొల్లప్రోలులో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. అనంతరం జులై 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. జులై 3న ఉదయం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో ప్రసంగిస్తారు.


కొండగట్టు దర్శనం


జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం సందర్శించారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో కాన్వాయ్ ఆపిన పవన్.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పవన్‌కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు, అభిమానులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జన సందోహంగా మారింది. పవన్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  


Also Read: CM Chandrababu: 'మండుటెండలో మీ కష్టాలు చూసి చలించా' - పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ