Delhi Airport Terminal Collapse: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టర్మినల్ 1 కూలిన ఘటన రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ప్రతిపక్షాలు వరుస పెట్టి మోదీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నాయి. కేవలం గొప్పలు చెప్పుకోడానికి హడావుడిగా మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నారని మండి పడుతున్నాయి. ఈ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిలియన్ డాలర్ల కొద్ది ఖర్చు చేసి ఇలాంటి ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నా వాటిలో నాణ్యత ఉండడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు మిగతా ప్రాజెక్ట్‌లైనా సేఫా కాదా అన్న వాదన కూడా గట్టిగానే జరుగుతోంది. బిహార్‌లోనూ దాదాపు నాలుగు వంతెనలు ఇటీవలే కూలిపోయాయి. ఇప్పటికే నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వీటికి తోడు కొత్తగా కట్టిన నిర్మాణాలూ ఇలా కూలిపోతున్నాయి. అయోధ్యలో పైకప్పు నుంచి నీళ్లు లీక్ అవడమూ సంచలనమైంది. కొత్తగా కట్టిన రోడ్లు వరదలకు ధ్వంసం అయ్యాయి. ఓవైపు మౌలిక వసతుల విషయంలో తమ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉందని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేస్తామని మోదీ సర్కార్ చెబుతోంది. కానీ...క్షేత్రస్థాయిలో మాత్రం ఆ స్థాయి నాణ్యత కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


Bloomberg Economics వెల్లడించిన వివరాల ప్రకారం వచ్చే రెండేళ్లలో భారత్‌లో 44 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. గత 11 ఏళ్లలో మౌలిక వసతుల కోసం చేసిన ఖర్చుకి ఇది సమానం. అంటే...కేవలం రెండేళ్లలోనే ఆ స్థాయిలో ఖర్చు పెట్టేందుకు మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి వరుస ప్రమాదాలు. మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి మౌలిక వసతుల ప్రాజెక్ట్‌ల నిర్మాణమూ ఓ కారణమే. గత పదేళ్లలో 80 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించినట్టు చెబుతోంది మోదీ సర్కార్. రైల్వేతో పాటు హైవేలనూ వేలాది కిలోమీటర్ల మేర అప్‌గ్రేడ్ చేసినట్టూ వివరిస్తోంది. ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ల కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడం సరైన నిర్ణయమే అయినా వాటిలో ఎంత నాణ్యత ఉంటోందన్నదీ చూడాలని నిపుణులు అంటున్నారు. అటు ప్రతిపక్షాలు చెబుతున్న విషయమూ ఇదే. కొంత మంది మంత్రులు లంచాలకు అలవాటు పడి ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నారని మండి పడుతున్నాయి. 


ప్రస్తుతానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ప్రమాదం మోదీ సర్కార్ పని తీరుపై అనుమానాలకు దారి తీస్తోంది. మౌలిక వసతుల కోసం కేటాయిస్తున్న నిధులను దారి మళ్లిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. భారీ ప్రాజెక్ట్‌లన్నీ పేక మేడల్లా కూలిపోతున్నాయంటూ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కే రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేశారు. కూలిన టర్మినల్ ఇటీవల కట్టింది కాదని, పాతదే అని తేల్చి చెప్పారు. 


Also Read: Ladakh: లద్దాఖ్‌లో ఘోర విషాదం, యుద్ధ ట్యాంక్‌ నది దాటుతుండగా ప్రమాదం - ఐదుగురు సైనికులు గల్లంతు