Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎంను పండితులు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం బయట నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు.
మానవ సేవ ఎంచుకొని పేదలను ఆదరిస్తున్న నేత సీఎం జగన్ అని కొనియాడారు. చంద్రబాబుకు పదవీ దాహం, ధన దాహం మాత్రమే ఉంటుందని విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డికి కేవలం పేదలను అభివృద్ది చేయాలన్న దాహం మాత్రమే ఉంటుందని ప్రశంసించారు. చంద్రబాబు ఇంటింటికి ఉద్యోగం అన్నారని.. అమలు చేశారా అంటూ నారాయణ స్వామి ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. తిరుమలలో చంద్రబాబు గురించి మాట్లాడటం అపచారమని ఎద్దేవా చేశారు. స్కాముల చంద్రబాబు.. ఎన్టీఆర్ హయం నుండి నేటి వరకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూనే వస్తున్నాడని విమర్శలు చేశారు. అబద్దాల పుట్టలు టీవీ5, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడేది పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు పార్టీ.. పిచ్చి పార్టీ అని చంద్రబాబుతో ఉండేవాళ్లంతా రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళుగా అభివర్ణించారు ఏపీ డిప్యూటీ సీఎం. ప్రజల్లో నూటికి తొంబై శాతం మంది జగన్ అన్నే మా నమ్మకం, జగన్ అన్నే మాకు కావాలి అంటున్నారని నారాయణ స్వామి తెలిపారు. అలా లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
ఇటీవలే నారా లోకేష్ పాదయాత్రపై ఫైర్ అయిన నారాయణ స్వామి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒక్క కులం వెంట పరుగెడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు... అవినీతి ఫుల్లు అని పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తిరుమలలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం నాడు శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశం అంతా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తుందని, పేదవాడి అభివృద్ధికి నోచుకోని శత్రువులంతా ఒక్కటై పోతున్నారని, జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబుతో కలిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెన్నుపోటు దారులు అంతా ఒక్కటైనా.. సీఎం జగన్ ను ఏం చేయలేరని ఆయన అన్నారు. జగన్ పై ఈర్ష్య, ద్వేషాలతో రగిలి పోయే వారిని దేవుడి క్షమించడని, జగన్ వైపే ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారని, లోకేష్ పాదయాత్ర ఒక కులం వెంట మాత్రమే పరుగెడుతుందన్నారు. బెంగుళూరు నుంచి బస్సులో కేవలం తమ సామాజిక వర్గం వాళ్ళను తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారని, ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రలో జగనన్న శాంక్షన్ చేసిన రోడ్డు శిలాఫలకంను కొట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.