స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబును చంపితే ఆయన సతీమణి నారా భువనేశ్వరియే చంపాలని ఏపీ డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, చంద్రబాబు, భువనేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


'పదవీ కాంక్షతో అలా చేస్తున్నారేమో.?'


'నారా భువనేశ్వరి పదవీ కాంక్షతో చంద్రబాబుకు పెట్టే అన్నంలో ఏదైనా కలిపి చంపే కార్యక్రమం చేస్తున్నారో.? ఏమో.? నాకు తెలియదు.' అంటూ నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో చంద్రబాబుకి ఆరోగ్యం బాగా లేదంటూ భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్ అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.


కేవలం చర్మ సంబంధం వ్యాధే


జైల్లే చంద్రబాబుని పరీక్షించిన వైద్యులు ఆయన కేవలం చర్మ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నట్లు చెప్పారని, తగు మెడిసిన్ అందించినట్లు నారాయణ స్వామి పేర్కొన్నారు. స్కిన్ డిసీజ్ ఎక్కువ కాకుండా ఉండేందుకు ఏసీ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తే దానికి కూడా ఒప్పుకొన్నామని అన్నారు. సామాన్యుడు జైలుకు పోతే ఓ శిక్ష, ఆర్థిక నేరస్థుడు జైలుకు పోతే మరో శిక్షా.? అంటూ ఆయన ప్రశ్నించారు.


సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం


ఏపీలో ప్రతి పేదవాడి సంక్షేమం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రశంసించారు. అవకతవకలకు వీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.


పురంధేశ్వరిపైనా విమర్శలు


పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కాదని, ఆమె టీడీపీ నాయకురాలని నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబును ఏ విధంగానైనా కాపాడుకోవాలనే ఆమె తపన పడుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికి పురంధేశ్వరికి అర్హత లేదని మండిపడ్డారు. 


ఆమెకు ఆ అర్హత లేదు


మద్యం పాలసీపై  మాట్లాడే అర్హత పురంధేశ్వరికి లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తెస్తే, టీడీపీని లాక్కొని చంద్రబాబు మద్య నిషేధం ఎత్తేసినప్పుడు ఆమె ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాగా, ఏపీలో మద్యం పాలసీపై గత కొద్ది రోజులుగా పురంధేశ్వరి విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం తయారీ కేంద్రాల యజమానుల పేర్లు బహిర్గతం చేయాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.


చంద్రబాబు హయాంలోనే


2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు తన అనుచర గణానికి 4,378 మద్యం షాపులను కట్ట బెట్టారని, 43 వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఏరులై పారించారని విమర్శించారు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గానీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న ప్రతీ బ్రాండు చంద్రబాబు పాలనలో తీసుకొచ్చినవే అని, అందుకే వాటిని 'సీ' బ్రాండ్లు అంటున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.


మద్యపానంతో లివర్ డ్యామేజీ


మద్యాన్ని 8 నుంచి పదేళ్ల పాటు తీసుకుంటే లివర్ చెడిపోవచ్చని, దానికి బ్రాండుతో సంబంధం లేదని డిప్యూటీ నారాయణ స్వామి అన్నారు. నిమ్హాన్స్ నివేదిక ప్రకారం దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య 15 శాతం పెరిగిందని తెలిపారు.