Elections Commission News: ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి - డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఏపీ సచివాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. వీరు ఇద్దరికీ కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సీఎస్, డీజీపీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు, ఘర్షణలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉంటే సీఎస్, డీజీపీలు ఏం చేస్తున్నారని.. ఆ ఘటనలపై తమకు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. మే 16న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు (మే 15) సీఎస్, డీజీపీ భేటీ అయి చర్చించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చేందుకు రేపు సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లనున్నారు.


ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలు ఏంటని కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దర్నీ ప్రశ్నిస్తూ సమన్లు ఇచ్చింది. హింసాత్మక ఘటనల తర్వాత నివారణగా ఏం తీసుకున్నారంటూ అధికారులను ప్రశ్నించింది. ఈ అంశాలపై అత్యవసరంగా భేటీ అయిన డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ ఏడీజీలు.. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలు.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాల్సిన వివరణపై చర్చించినట్టుగా తెలుస్తోంది.