AP CONGRESS leaders: వైఎస్సార్ కుటుంబం మళ్లీ కాంగ్రెస్ కు దగ్గర అవుతుందనే ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు షర్మిల తరువాత విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా కాంగ్రెస్ లోకి రావాలంటూ నేతలు ఆహ్వానిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో చర్చ..
తెలుగు రాష్ట్రాల్లో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టి అసలు కనిపించకుండా పోయింది. ఇప్పటివరకు ఆ పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే ఇటీవల జాతీయ కాంగ్రెస్ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో నేతలకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రాష్ట్ర విభజన అంశం తెర మీదకు రావటం, కాంగ్రెస్ పార్టి రాష్ట్రాన్ని విడకొట్టి సంచలన రాజకీయాలకు తెరతీయటంతో పరిస్దితులు ఉన్నపళంగా మారిపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి వైఎస్సార్ కుటుంబం తిరిగి కాంగ్రెస్ కు దగ్గర అవుతుందనే ప్రచారం జరగటంతో ఆంధప్రదేశ్ రాజకీయాల్లో దాని ప్రభావం ఉంటుందని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికతో ఎన్నికల సమయంలో ఏపీలో కూడా ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం అవుతోంది. 


షర్మిల తరువాత విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా..
షర్మిల కాంగ్రెస్ పార్టిలోకి వస్తారనే అంశం చర్చకు వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అతితక్కువ మంది కాంగ్రెస్ నాయకులు చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అవకాశాలకు వేదికగా ఉంటుందని, ఎవరు వచ్చినా పార్టి ఆహ్వనిస్తుందని చెబుతున్నారు. అంతే కాదు కాంగ్రెస్ వంటి పార్టీలో ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదని, అలాంటి అవకాశాలు ఉన్న పార్టిని ఎవ్వరూ వదలుకోరని చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి రావటం వలన పార్టికి మేలు కలుగుతుందని అంటున్నారు. అంతే కాదు షర్మిలతో పాటుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ, షర్మిల భర్త  బ్రదర్ అనిల్ కూడా కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు. 


రాహుల్ ప్రధాని కావాలనుకున్న రాజశేఖర్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టిలో అనేక మంది నాయకులకు గుర్తింపు వచ్చిందని అందులో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్, వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టిగా ఉన్న రోజుల్లోనే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో రాజశేఖర్ రెడ్డి పని చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరో వైపున భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన యాత్ర తో కాంగ్రెస్ నే వీడిన పాత నేతలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావటానికి ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే వైఎస్ ఫ్యామిలి కూడా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని, ఇందుకు జులై ఎనిమిదో తేదీ, వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంటున్నారని చెబుతున్నారు.