YS Jagan Mohan Reddy satires on YSRCP MLAs: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన సమీక్ష కాస్త హాట్ హాట్ గా సాగినట్టు తెలుస్తోంది. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జ్‌లు ఎవరెవరు ఎంత హుషారుగా గడప గడపకు వెళ్తున్నారనే విషయాన్ని పీకే టీమ్ వివరించింది. కొంతమంది ఎమ్మెల్యేలు కనీసం 10 రోజులు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లలేదని పీకే టీమ్ ఓ రిపోర్ట్ సీఎం జగన్‌కు ఇచ్చింది. వారి పేర్లను సీఎం జగన్ చదివి వినిపించారు. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు అస్సలు గడప గడపకు వెళ్లలేదనే రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఎవరా ప్రబుద్ధులు అంటూ సీఎం జగన్ జోక్ చేశారు. ఆయన జోక్ చేసినట్టు కాదు, కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు అనుకోవాలి. ఆ ఇద్దరు నేతలు ఆళ్లనాని, ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా గడప గడప కార్యక్రమంలో పాల్గొనలేదని పీకే టీమ్ జగన్ కి రిపోర్ట్ ఇచ్చింది. 


ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..?
ఇటీవల నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. జగనన్న కాలనీల పట్టాలు పంపిణీ చేశారు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో కూడా హుషారుగా పాల్గొన్నారు. కానీ ఆయన చేసిన తప్పల్లా ఒకటే.. గడప గడపకు అధికారికంగా మొదలు పెట్టకపోవడం. దీంతో ఆయన పేరు లిస్ట్ లో చేరింది. ఆ లిస్ట్ లో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో జగన్ కి కోపమొచ్చింది. 


సున్నితంగా హెచ్చరించిన జగన్.. 
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విషయంలో ఎమ్మెల్యేల పని తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌  ద్వారా సీఎం జగన్ కు పీకే టీమ్ వివరించింది. 22 మంది ఎమ్మెల్యేలు గడప గడప విషయంలో బాగా వెనకపడ్డారని తెలిపింది. కనీసం 10 రోజులు కూడా వారు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదని పీకే టీమ్ వివరించింది. దీంతో వారిని స్పీడ్ పెంచాలని సున్నితంగా హెచ్చరించారు సీఎం జగన్. ఇక అస్సలు కార్యక్రమమే మొదలుపెట్టని ఆళ్లనాని, ప్రసన్న కుమార్ రెడ్డికి కాస్త ఘాటుగానే తలంటారని తెలుస్తోంది. ఎవరా ప్రబుద్ధులంటూ సెటైర్ వేసిన జగన్.. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారట. 


ప్రజల్లో తిరిగితేనే గెలుస్తారు..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. అదేమీ కష్టం కాదని గతంలోనే ఎమ్మెల్యేలకు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెబుతున్నానని రివ్యూ మీటింగ్ లో చెప్పారు జగన్. తాను చేయాల్సిందంతా తన స్థాయిలో చేస్తున్నానని, ఇక ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాల నిధులిస్తున్నట్టు చెప్పారు. దాంతోపాటు అదనంగా ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిధులతో స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోతే ఫలితాలు ఇలా ఉండవని చెప్పారు. 175 స్థానాలు టార్గెట్ పెట్టుకోవాలని, గతంకంటే మెరుగైన ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు జగన్. ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేలే గెలుస్తారని, తిరగకుండా ఉన్నా, మొక్కుబడిగా తిరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.