CM Jagan Review : వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష చేశారు. సమగ్ర సర్వే ప్రగతిని సీఎం జగన్ ఆరా తీశారు. సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భూ సమగ్ర సర్వేతో దశాబ్దాల నుంచి ఉన్న భూ వివాదాలు పరిష్కారమవుతాయని సీఎం అన్నారు. భూ వివాదాలను పరిష్కరించడం సమగ్ర సర్వే ప్రధాన ఉద్దేశంలో ఒకటని సీఎం అన్నారు. సమగ్ర సర్వేను నిర్ణీత టైంలోగా పూర్తి చేయాలని, అందుకు అన్ని చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు. సర్వేకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. 


డ్రోన్స్, రోవర్స్ వినియోగం


డ్రోన్స్, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు సమకూర్చుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి అంశంలోను వేగంగా పనిచేస్తూ సమగ్ర సర్వేను పూర్తి చేయాలన్నారు. భూ సమగ్ర సర్వేను అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సర్వే జరుగుతోందన్న సీఎం.. ఈ సర్వేను పూర్తిచేయడంతో ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 






మూడు దశల్లో సర్వే


ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ సమగ్ర సర్వీ కార్యక్రమాన్ని మూడు దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటి దశలో 5,300 రెవెన్యూ గ్రామాల్లో, రెండో దశలో 5,700, మూడో దశలో 6,460 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ సర్వే ప్రక్రియలో నాలుగు కీలక పనుల్ని పూర్తిచేసేందుకు షెడ్యూల్‌ రూపొందించింది. డ్రోన్‌ సర్వే పూర్తి చేసి ఆ ఫొటోలను ఇవ్వడం, క్షేత్ర స్థాయి సర్వే, సర్వే పూర్తయినట్లు ప్రకటించే నోటిఫికేషన్‌, వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు పత్రం జారీ చేసేందుకు షెడ్యూల్‌ ఇందులో ఉన్నాయి. సర్వే మొదటి దశలో వచ్చే ఏడాది జులై 31, రెండో దశ గ్రామాల్లో వచ్చే 2023 ఆగస్టు 30, మూడో దశ గ్రామాల్లో వచ్చే ఏడాది నవంబర్‌ 30 నాటికి భూహక్కు పత్రాలు జారీ చేయాల్సిఉంది. ప్రస్తుతం 2,562 రెవెన్యూ గ్రామాల్లో  డ్రోన్‌ సర్వే పూర్తైంది. వాటిలో 1,272 రెవెన్యూ గ్రామాల డ్రోన్‌ ఫొటోలను సిబ్బంది సర్వే బృందాలకు అందించారు. ఇప్పటికే దాదాపు వెయ్యి గ్రామాల్లో రీ సర్వే పూర్తైంది. రీసర్వేలో 67 డ్రోన్లు వినియోగిస్తుండగా త్వరలో వాటి సంఖ్యను క్రమంగా పెంచనున్నారు.