Jagananna Amma Vodi Funds: 2022 -23 విద్యాసంవత్సరానికి అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో జగన్  42.61లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ పది రోజుల పాటు పండుగల జగనన్న అమ్మ ఒడి కొనసాగుతుందని తెలిపారు.


ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 83.15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని జగన్ అన్నారు. నాలుగేళ్లలో కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067.28 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. విద్యా రంగంలో సంస్కరణలపై అక్షరాలా రూ.66,722.36 కోట్లను వినియోగించామన్నారు. స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ అవుతున్నాయని అన్నారు. అవినీతి, వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలు, పార్టీల వాళ్లకు నిధులు అందజేస్తున్నామని తెలిపారు. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అమ్మఒడి పథకం తీసుకొచ్చామని.. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా తీర్చి దిద్దుతున్నామన్నారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి ఏపీ పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.






పిల్లలకు అర్థమయ్యేందుకు డిజిల్ బోధనను తీసుకొచ్చామన్నారు జగన్. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. ట్యాబ్‌లు సైతం అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు తొలిసారిగా బైలింగ్యువల్‌ పుస్తకాలు కూడా ఇచ్చామన్నారు. వంద శాతం పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ జగనన్న విద్యా దీవెన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే అమ్మఒడి అమలు అవుతుందని స్పష్టం చేశారు. విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్థులకు ఎక్కడ సీటు వచ్చినా.. కోటి 25 లక్షల అందజేస్తున్నామన్నారు. బడులు ప్రారంభం అయిన వెంటనే మెరుగైన విద్యా కానుక కిట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.