AP CM Jagan: 108 అంబులెన్సుల వాహనాలను ఏపీ సీఎం జగన్.. జెండా ఊపి మరీ ప్రారంభించారు. మొత్తం 146 నూతన అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా.. కొత్త అంబులెన్సులో ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. ప్రారంభోత్సవ అనంతరం 108 అంబులెన్స్ వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగాం సురేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











మొత్తం 768 అంబులెన్సులు అందుబాటులోకి..


సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 423 కొత్త అంబులెన్సులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్సులు పని చేస్తున్నాయి. ఇందులో బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్, నవజాత శిశువుల అంబులెన్సులు తదితరాలు ఉన్నాయి. ఈ గతేడాది జనవరి నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఎమర్జెన్సీ కేసుల లిస్ట్‌ను ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2022 జనవరిలో 93 వేల 451 మందిని, ఫిబ్రవరిలో 76 వేల 142 మందిని, మార్చిలో 88 వేల 775, ఏప్రిల్ లో 92, 337, మేలో 89 వేల 32, జూన్ 86 వేల 225, జులైలో 97 వేల 865, ఆగస్టులో 96 వేల 212 మంది, సెప్టెంబర్ 98 వేల 746 మంది, అక్టోబర్ నెలలో లక్షా 234 మంది, నవంబర్ 81 వేల 364 మందిని అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారని పేర్కొంది.  అయితే ఇందులోనూ 19 శాతం గర్భిణీ కేసులు కాగా, 16 శాతం కిడ్నీ డయాలసిస్, 13 శాతం ఇతర కేసులు, 9  శాతం మూత్రపిండ సమస్యలు, 8 శాతం శ్వాస సంబంధిత, 5 శాతం ప్రసూతి సంరక్షణ, 5 శాతం వాహనేతర గాయాలు, 4 శాతం పొత్తి కడుపు నొప్పి కేసులు, 4 శాతం గుండె సమస్యలు, మరో 4 శాతం ద్వరం, 3 శాతం అపస్మారక స్థితి కేసులు, 3 శాతం విష ప్రయోగం కేసులు , మరో రెండు శాతం పాము, కీటకాల కాటు కేసులు, 2 శాతం దాడులు, 2 శాతం ఫిట్స్ కేసులు, 1 శాతం డయాబెటిక్ కేసులు ఉన్నాయి. 


ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే వస్తున్న అంబులెన్సులు..


ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 20 నిమిషాలలోపు 108 అంబులెన్సులు చేరుకోవాలనే నిబంధన విధించగా... 18 నుంచి 19 నిమిషాల్లోనే వస్తున్నాయట. పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల గడువు విధించగా ట్రాఫిక్ తదితర సమస్యల కారణంగా 15 నుంచి 18 నిమిషాల సమయం పడుతోందని నివేదికలో పేర్కొొంది. అత్యధికంగా 19 శాతం వరకు ఎమర్జెన్సీ కేసుల్లో గర్భిణులను 108 అంబులెన్సులు ప్రసవం కోసం ఆస్పత్రులకు తరలిస్తున్నాయి.