త్వరలో విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో విశాఖ అభివృద్ధి చెందుతున్న ఆయన, రాష్ట్రంలోనే విశాఖ పెద్ద నగరం అని అన్నారు. పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారనున్నట్లు వెల్లడించారు. 


ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం


విశాఖ రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ క్రమంలో 4,160 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు. తొలుత వెయ్యి మందికి ఉద్యోగాలు దక్కే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగుళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతుందని సీఎం తెలిపారు. ఇప్పటికే సాగర తీరం ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్నారు. విశాఖలో 8 యూనివర్శిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, ప్రతీ ఏడాది 15 వేల మంది ఇంజినీర్లు తయారవుతున్నారని చెప్పారు.


ఒక్క పోన్ కాల్ తోనే


ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక్క పోన్ కాల్ తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తానని హామీ ఇచ్చారు. విశాఖలో విస్తారంగా అవకాశాలున్నట్లు వెల్లడించారు.


ఫార్మా యూనిట్స్ ప్రారంభం


విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభం అనంతరం సీఎం జగన్ పరవాడ సెజ్ లో ఫార్మా యూనిట్ ను ప్రారంభించారు. అలాగే 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను సైతం ప్రారంభించారు. 


అచ్యుతాపురంలోనూ


అచ్యుతాపురంలో లారస్ యూనిట్ 2ను సీఎం జగన్ ప్రారంభించారు. రూ.460 కోట్లతో ప్రారంభించిన ఈ యూనిట్ ద్వారా 1200 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం తెలిపారు. అలాగే లారస్ కు సంబంధించి మరో 2 కొత్త యూనిట్లకు సైతం సీఎం శంకుస్థాపన చేశారు. రూ.850 కోట్లతో కొత్తగా నిర్మించే ఈ యూనిట్ల ద్వారా మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.