AP CM Jagan: తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అరకొర సాయం మాత్రమే అందిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో రూ. 4 వేల మాత్రమే ఇచ్చారని, అది కూడా కొందరికి మాత్రమే అందేదని అన్నారు. బాపట్ల జిల్లాలోని నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్కకార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఐదేళ్లలో కేవలం రూ.104 కోట్లు మాత్రమే ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించారు. టీడీపీ పాలనలో 1100 బోట్లకు మాత్రమే రాయితీ ఇస్తే.. ఇప్పుడు 20 వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో డీజిల్ పై రూ.6 మాత్రమే రాయితీ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వ పాలనలో డీజిల్ పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనను చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. పేద వారికి సాయం చేస్తుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
Also Read: మత్స్యకారులకు వరుసగా ఐదో ఏడాది భరోసా నిధులు విడుదల
ఎన్నికలు వస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, మైనారిటీలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. తాను మంచిని నమ్ముకున్నానని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నామని వెల్లడించారు.
Also Read: దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు - మంత్రి పెద్దిరెడ్డి
'అధికారంలో ఉంటే అమరావతిలో.. లేకపోతే జూబ్లీహిల్స్ లో'
చంద్రబాబు అధికారంలో ఉంటే అమరావతిలో.. అధికారం లేకపోతే జూబ్లీహిల్స్ లో ఉంటారని సీఎం జగన్ విమర్శించారు. ఏపీలో దోచుకుని హైదరాబాద్ లో ఉండటం వీరి పని అంటూ ఆరోపించారు. ఏపీలోనే తన శాశ్వత నివాసం ఉందని, తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు జగన్. ప్రధానులను, రాష్ట్రపతులను చేశానని చెప్పుకునే పెద్ద మనిషికి.. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగే దమ్ముందా అంటూ జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబు నాయుడుకు లేదని, ఆయనకు సభలు పెట్టే ధైర్యం కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్ పై ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లు ప్రజలకు మంచి చేయగలరా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాబు, న దత్తపుత్రుడు నమ్ముకున్నది పొత్తులను, కుయుక్తులనేనని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని, ఆయన పేరు తీస్తే గుర్తుకు వచ్చేది వెన్నుపోటే అని విమర్శలు గుప్పించారు.
'వివాహాలు చేసుకునేది వీళ్లే, విడాకులు తీసుకునేది వీళ్లే'
ఎన్ని వ్యవస్థనలు తనపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడకుండా, ప్రజల తరఫున నిలబడి మంచి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రిని కలిస్తే చాలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ తో అంటకాగిన వాళ్లు తనను విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పొత్తులు పెట్టుకుని, తెగదెంపులు చేసుకునేది వీళ్లేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహాలు చేసుకునేది వీళ్లే.. విడాకులు తీసుకునేది వీళ్లేనని ఎద్దేవా చేశారు.