Breaking News Live: పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా, పలువురు విద్యార్థులకు గాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Janasena In Tirupati: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి, ఆర్టీసీ RMO కి వినతిపత్రం అందజేశారు ప్రజలపై మోపిన భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాజా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవర పెడుతోంది. నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 50 మంది వైద్య విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మందికి, నలుగురు హౌస్ సర్జన్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బాధితులు ప్రస్తుతం జీజీహెచ్ పెయింగ్ బ్లాక్ లో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య సిబ్బంది ల్యాబ్ కు పంపారు.
Delhi Capitals Player Tests Positive: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో కరోనా కలకలం రేపుతోంది. ఇదివరకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓ ఫిజిజయోకు కరోనా సోకగా.. తాజాగా జట్టులో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓ ఆటగాడికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, జట్టు మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉంచారు. ఏ ఆటగాడికి కరోనా సోకిందనే వివరాలను ఫ్రాంచైజీ గోప్యంగా ఉంచింది.
School Bus Overturned: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు కొందరు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సు లో 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
కామారెడ్డి జిల్లాలో తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో విచారణ అధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి నియమితులు అయ్యారు. ఈ కేసులో మూడు బృందాలతో నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. నేడు నిందితుల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. అయితే, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన గంగం సంతోష్ శనివారం కామారెడ్డిలో తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో హైదరాబాదు మేయర్ విజయలక్ష్మి, తెలంగాణ పార్లమెంటు కమిటీ ఛైర్మన్ కే.కేశవరావు,కమిటీ సభ్యులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన హైదరాబాదు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ. స్వామి వారిని కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు.
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం లో దారుణం జరిగింది. ఉప్పెన సినిమా తరహాలో వాస్తవ ఘటన కలకలం రేపింది.. శ్రీకాంత్ (బాధిత యువకుడు) మర్మాంగంపై రోకలి బండతో యువతి తండ్రి దాడి చేశారు. నరసింహారావు పాలెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానుష ఘటనకు సంబందిచిన వివరాలు ఇలా ఉన్నాయి. తన కూతురు వెంటపడుతున్నాడు అనే నెపంతో నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన సింగపం శ్రీకాంత్ ని ఇంటికి పిలిపించి మరి తండ్రి జాన్ దాడికి పాల్పడ్డాడు. చీకటి గదిలో బంధించి, చిత్రహింసలు పెట్టి రోకలిబండతో యువకుని మర్మాంగాన్ని చిద్రం చేశాడు. శ్రీకాంత్ అపస్మారక స్దితిలోకి వెళ్ళటంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఆస్పత్రికి తరలించారు. నూజివీడు నుండి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Background
అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఉంది. బంగాళాఖాతం నుంచి వీచే గాలులతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. తమిళనాడు, యానాం, ఒడిశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తీరం వెంట 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లా పలాస-తెక్కళ్ళి పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు), పార్వతీపురం మణ్యం జిల్లా సలూరు వైపు అక్కడక్కడ కొన్ని ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. విశాఖ ఏజెన్సీ, కృష్ణా, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ సాయంకాలం వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ నగరం పరిసర ప్రాంతాలైన అనకాపల్లి, పెందుర్తి, పరవాడలో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విజయనగరం జిల్లా సాలూరు వైపుగా కొన్ని భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి.
పల్నాడు జిల్లా, ఎన్.టి.ఆర్. జిల్లా (విజయవాడ), కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లుల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలతో ఏపీ ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, వి.కోట, చిత్తూరు టౌన్ సైడ్ భాగాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. అనంతపురం, సత్యసాయి (పుట్టపర్తి), కడప, చిత్తూరు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడాని వర్షాలు ఉన్నాయని జాగ్రత్త పడాలని సూచించారు. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచించారు. వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత తగ్గి ఎండల నుంచి ప్రజలకు ఊపశమనం కలగనుంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -