CM Chandrababu: 'ఏపీ పెట్టుబడులకు అనుకూలం, భారీగా ఇన్వెస్ట్ చేయండి' - జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ

Davos Tour: ఏపీ పెట్టుబడులకు పూర్తి అనుకూలమని.. పెద్దఎత్తున ఇన్వెస్ట్ చేయాలని సీఎం చంద్రబాబు దావోస్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Continues below advertisement

AP CM Chandrababu Meet Industrialists In Zurich: పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనుకూలమని.. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) బృందం జ్యురిచ్‌లోని తెలుగు పారిశ్రామికవేత్తలతో సోమవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా 'జాబ్స్ ఫర్ తెలుగు' కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ, యూరప్‌లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై వారికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటివరకూ పశ్చిమాసియా, అమెరికా దేశాలకు పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు తరలివెళ్లారని, ఇప్పుడు యూరప్‌లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వర్కర్లకు ఇమ్మిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు.

Continues below advertisement

ఈ క్రమంలో యూరప్‌లో తెలుగు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. యూరప్‌లో క్రిప్టో తరహా ఆర్థిక వ్యవస్థను స్టార్టప్‌గా పెట్టామని తెలుగు పారిశ్రామికవేత్తలు ఆయనకు వివరించారు. ఏపీని క్రిప్టోజోన్, క్రిప్టో ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉందని తెలిపారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్, మంత్రి టీజీ భరత్ ఉన్నారు. అటు, పారిశ్రామికవేత్తలతో భేటీకి ముందు హిల్టన్ హోటల్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు.

ప్రత్యేక అనుమతులు

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సానుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్అండ్‌డీ, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్రెసిషన్ ఇన్‌స్ట్రుమెంట్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. 'సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రగతి శీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సహకాలు అందజేస్తున్నాం. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంది. 1053 కి.మీ.ల సుదూర తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉన్నాయని చెప్పారు.

మరో ఏడాదిన్నరలో భోగాపురం, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో స్టార్టప్స్ ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. స్విస్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మోడల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలి. పూణేలో గెబిరిట్ తరహాలో ప్లంబింగ్ ల్యాబ్‌లు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.' అని లోకేశ్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్, స్విస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్ (SWISSMEM) సెక్రటరీ జనరల్ రావోల్ కెల్లర్, ఒర్లికాన్ సీఈవో మార్కస్ టకే, యాంగిస్ట్ ఫిస్టర్ సీఈవో ఎరిక్ షెమిద్, స్విస్ టెక్స్ టైల్స్ ఎకనమిక్ అండ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ హెడ్ బోజర్న్ వాండర్ క్రోన్, హెచ్ఎస్‌బీసీ సీఈవో స్టీవెన్ క్లెన్, కేంద్ర మంత్రి రామ్మోహన్, ఏపీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు

Continues below advertisement