అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అయితే సతీ సమేతంగా తొలిసారి ప్రధానిని చంద్రబాబు కలవనున్నారు. గతంలో పలుమార్లు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయి రాష్ట్ర అభివృద్ధి, ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించేవారు. నేటి పర్యటనలో రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబు దంపతులు ప్రధాని మోదీకి ఆహ్వానం అందజేయనున్నారు. మే 2న అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రాజధాని అమరావతితో పాటు పోలవరం సహా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఏర్పాట్లు చేస్తోంది.