Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Andhra News: పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసే పథకాన్ని తిరుచానూరులో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
CM Chandrababu Started Gas Through Pipeline In Tiruchanur: ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ (Green Energy) హబ్‌గా మారుతుందని.. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. తిరుచానూరులో (Tiruchanur) ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఓ ఇంట్లో స్టవ్ వెలిగించి టీ పెట్టారు. పైప్ లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలున్నాయని.. రాష్ట్రంలో 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. 'ఏపీకి పుష్కలంగా సహజ వనరులున్నాయి. హైవేలు, సముద్రతీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయి. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పని చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.
పీ 4 విధాన పత్రం విడుదల
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు పీ-4 (పబ్లిక్ - ప్రైవేట్ - పీపుల్ - పార్టనర్ షిప్) విధానంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారు బాగుండడమే పండుగ అని.. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఆకాంక్షించారు. ఆర్థిక అసమానతలు తొలగి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని అన్నారు. ఇందులో భాగంగానే పీ 4 విధానం ప్రతిపాదించామని.. అందులో అంతా భాగస్వాములు కావాలని అన్నారు. ఆరోగ్యం, ఆదాయం, ఆనంద రాష్ట్రం కోసం సంకల్పం తీసుకుందామని కోరుతూ పీ-4 విధాన పత్రాన్ని విడుదల చేశారు.
అటు, తిరుపతి పర్యటన పూర్తైన అనంతరం సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లనున్నారు. 3 రోజులు కుటుంబసభ్యులతో కలిసి అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.