Fire Accident In Madanapalle Sub Collector Office: అన్నమయ్య (Annamayya) జిల్లా మదనపల్లె (Madanapalle) సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రికార్డు రూములో పలు కీలక ఫైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూముల దస్త్రాలు, భూముల రీసర్వేకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కాలిపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. 


సీఎం చంద్రబాబు సీరియస్


కాగా, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధమైన అధికారులు స్పందించకపోవడంపై సీరియస్ అయ్యారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్హా హాజరయ్యారు. సీసీ ఫుటేజీ సహా మొత్తం వివరాలన్నీ విచారణలో బయటకు తీయాలని అధికారులకు నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ, సీఐడీ చీఫ్ మదనపల్లెకు వెళ్లనున్నారు. అగ్నిప్రమాదంలో కీలక దస్త్రాలు దగ్ధం కావడంపై విచారణ చేయనున్నారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఈ ఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అగ్ని ప్రమాదమా.? లేదా కుట్ర పూరితమా.? అనేది నిగ్గు తేల్చాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.


పోలీసుల అదుపులో ఉద్యోగి


కాగా, సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆదివారం రాత్రి 10:30కు ఓ ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు. సెలవు రోజైనా ఉద్యోగి కార్యాలయంలో అంత వరకూ ఎందుకు ఉన్నారనే దానిపై విచారిస్తున్నారు.


Also Read: YS Jagan: 'సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' - పోలీసులపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం, ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత