CM Chandrababu Comments In Party Membership Event: తెలుగుదేశం పార్టీ (TDP) ఓ రాజకీయ విశ్వవిద్యాలయం అని.. నేటి తరం తెలుగు రాజకీయ నాయకుల మూలాలు టీడీపీలోనే ఉన్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన మంగళగిరిలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ టీడీపీ అని.. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేసేందుకు అనునిత్యం పని చేస్తున్నామన్నారు. వారి సంక్షేమం కోసమే ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు. చాలా మంది రాజకీయ కక్షలకు బలైన సంఘటనలు చూశామని.. అనేక కారణాలతో కార్యకర్తలు చనిపోయారని అన్నారు. వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు.
'1995 సీఎంనే.. 2014 సీఎంను కాదు'
తాను 1995 సీఎంనే కానీ.. 2014 సీఎంను కాదని.. ఈసారి కచ్చితంగా రాజకీయ పాలనే చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. 'రాజకీయ ముసుగులో తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదు. క్యాడర్ నుంచి వస్తోన్న విమర్శలను అర్థం చేసుకోగలను. రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక దందా జరిగినా తిరుగుబాటు చేయండి. నేను అండగా ఉంటా. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. టీడీపీ పని అయిపోయిందన్న వాళ్ల పనే అయిపోయింది. పార్టీయే శాశ్వతం. టీడీపీకి ముందు ఆ తర్వాత అన్నట్లుగా తెలుగుజాతికి గుర్తింపు వచ్చింది. కార్యకర్తల మనోభావాలు గౌరవించే పార్టీ టీడీపీ. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా పెట్టిన పార్టీ. జాతీయ స్థాయిలో టీడీపీ పోషించిన కీలక పాత్రలు మరే పార్టీకి సాధ్యం కాలేదు.' అని పేర్కొన్నారు.