CM Chandrababu Review On Rains: రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వర్షాలపై ఎప్పటికప్పుడు ప్రజల మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపి వారిని అలర్ట్ చేయాలన్నారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని చెప్పారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ప్రజల ఫిర్యాదులు, వినతులపై వెంటనే స్పందించాలన్నారు. అటు, ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని వివరించారు.
ప్రస్తుతం నెల్లూరులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు తెలిపారు. మంగళవారం నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 676 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతానికి గానూ ఇప్పటివరకూ 734 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో జోరుగా వానలు దంచికొడుతున్నాయి. ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 17 వరకూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
మంగళవారానికి చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం.. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
భారీ వర్షాల దృష్ట్యా సోమవారం నుంచి మత్స్యకారులు 3 రోజులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800 425 0101 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కిందగానీ, హోర్డింగ్స్ కింద ఉండొద్దని, పాత ఇండ్లలోకి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు.