Chandrababu ordered to distribute school children kits with Jagan picture on it | అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని, వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే  అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టాడని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృథా అవకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. 


ప్రజాధనం వృధా అవకూడదని ఆలోచించే చంద్రబాబుకు, మాజీ సీఎం చంద్రబాబుకు చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. తన పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, పగ ప్రతీకారాలకు తావులేదని, తుగ్లక్ నిర్ణయాలు అసలే ఉండవని చంద్రబాబు చెప్పారు. తాను చెప్పిన మాట మేరకు.. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడని భావించి జగన్ బొమ్మ ఉన్న స్కూల్  కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొంటూ ఓ న్యూస్ క్లిప్‌ను టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.


ముగిసిన సెలవులు, ఇక స్కూల్స్ రీఓపెన్


వేసవి సెలవులు ముగిసి, ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు జూన్ 13న తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో స్కూల్ విద్యార్థులకు అమలవుతోన్న పథకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో తీసేశారు. ఈ మేరకు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తెలిసిందే. ఆఖరికి  పిల్లలకిచ్చే చిక్కీపై సైతం అప్పటి సీఎం జగన్ బొమ్మ వేయించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. గత ప్రభుత్వ పథకాలు కొన్ని రద్దు చేయడంతో పాటు మరికొన్ని పథకాలకు ముందు వైఎస్సార్ పేరు, జగనన్న అని పేర్లు చేర్చారు.  


వైసీపీ సర్కార్ అమలు చేసిన రెండు పథకాలకు జగన్ పేరును తొలగించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై జగన్ బొమ్మలకు సైతం స్వస్తి పలకాలని సూచించారు. స్కూల్ విద్యార్థులకు సంబంధించిన సామాగ్రిని అందజేసే స్కీమ్ ‘జగనన్న విద్యార్థి కానుక’. ఈ జగనన్న స్కూల్ కిట్‌లో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, బుక్స్, బెల్టు, షూస్, సాక్సులు, యూనిఫాం ఇస్తారని తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం జగనన్న విద్యార్థి కానుక పేరును ‘స్టూడెంట్ కిట్’ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సర్వ శిక్షా అభియాన్ ఇప్పటికే దీనిపై మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. 


ఇకనుంచి గోరుముద్ద పథకం 
గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ‘జగనన్న గోరుముద్ద’ లో సైతం టీడీపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రభుత్వం పనిచేయాలి కానీ మన పేరును ప్రతి విషయాల్లోనూ తగిలించకూడదని భావించి ఈ పథకం నుంచి ‘జగనన్న’ అనే పదాన్ని తొలగించారు. ఇక నుంచి విద్యార్థులకు ఆదివారం తప్పా, మిగతా 6 రోజులు గుడ్డు, చిక్కీలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించే పథకాన్ని ‘గోరుముద్ద’గా వ్యవహరించరున్నారు. విద్యార్థులకు అందించే చిక్కీ మీది కవర్ పై మాజీ సీఎం జగన్ బొమ్మ ఉండేది. జగన్ ఫొటో తొలగించి, ఏపీ ప్రభుత్వ రాజముద్రతో పిల్లలకు చిక్కీలు సరఫరా కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.