Madhya Pradesh Road Accident | అమరావతి: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తెలుగు యాత్రికులు మృతి చెందారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంగళవారం సెక్రటరీల సమావేశంలో పాల్గొన్న సమయంలో సీఎం చంద్రబాబుకు ఘటనపై అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రమాదం జరిగి, హైదరాబాద్ వాసులు మృతిచెందడంతో చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ ఏపీ29 W 1525 కావడంతో మినీ బస్సు ఏపీకి చెందినదిగా భావించారు. గాయపడిన వారిని సంప్రదించిన పోలీసులు వారిని హైదరాబాద్ వాసులుగా నిర్ధారించారు.
తెలంగాణ లోని హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు ఓ మినీ బస్సులో కొందరు భక్తులు వెళ్లారు. ప్రయాగ్ రాజ్ నుంచి భక్తులు తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి గాయపడిన వారికి అన్ని విధాలుగా సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏడుగురు చనిపోయారని అందిన వార్తపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని నాచారానికి చెందిన కొందరు భక్తులు 144 ఏళ్లకు జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో ఏపీ వాసులు పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి పూజలు చేసిన అనంతరం, పర్యాటక ప్రదేశాలు దర్శించుకుని తెలంగాణకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ జిల్లాలోని NH-30పై సిహోరా సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఏడుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందగానే జబల్‌పూర్ కలెక్టర్, జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదం వల్ల సిహోరా బైపాస్ వద్ద 10, 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వేల వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయాయి.