CM Chandrababu Comments: గత ఐదేళ్ల పాలనలో అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర (Madakasira) మండలం గుండుమలలో (Gundumala) పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి పింఛన్ డబ్బులు అందించారు. ఈ క్రమంలో వారి సమస్యలు తెలుసుకున్న సీఎం.. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సవిత, స్థానిక టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు. అనంతరం గుండుమలలో నిర్వహించిన ప్రజావేదిక సభలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. వర్షంలోనే ఆయన తన ప్రసంగం కొనసాగించారు.






'మేం పాలకులం కాదు సేవకులం'


తాము పాలకులం కాదని.. సేవకులం అని ప్రజలు గుర్తించాలని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో పరదాలు, చెట్లు నరకడాలు, బారికేడ్లు ఉండవని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 'వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా సహజ వనరుల దోపిడీ జరిగింది. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే దోచుకున్నారు. సర్వే రాళ్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫోటోలు వేసుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యతను నేను తీసుకుంటాను. అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తాం. పట్టు పరిశ్రమతో మంచి ఆదాయంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుంది. టీడీపీ హయాంలో సాగునీటి కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం. కరువు జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనేది ఉండదు. అనంత జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటాం. మడకశిరలో రూ.60 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తాం. ఇక్కడ రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. పేదలకు ఇంటి నిర్మాణానికి బాధ్యత తీసుకుంటాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.










96 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి


మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 96 శాతం పూర్తైంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. సత్యసాయి జిల్లా గుండుమలలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికది వెళ్లి పింఛన్ అందించగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు 96 శాతం పంపిణీ పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లా పెన్షన్ల పంపిణీ జరిగినట్లు చెప్పారు.






 


Also Read: CM Chandrababu: శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు - కృష్ణమ్మకు జలహారతి, సుప్రీం తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి